UP CM Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది భాజపా. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే సీఎం యోగికి ప్రజల్లో ఉన్న విశేష ఆదరణ వల్లే కమలం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాక, తనదైన మార్క్ పాలన, నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారని అంటున్నారు. మరి ఇలాంటి యోగి.. భవిష్యత్తులో బలమైన జాతీయ స్థాయి నేతగా ఎదుగుతారా? భాజపాకు అత్యంత కీలకంగా మారతారా?
యోగి రాజకీయాల్లో ఎదిగిన తీరును ఓ సారి పరిశీలిద్దాం.
Yogi Adityanath National Politics
యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న పౌరిగడ్వాల్ పాంచుర్‌లో(ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది) రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్ శ్రీనగర్‌లోని హెచ్‌ఎన్‌బీ గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. బాల్యం నుంచే హిందూత్వ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు.
26 ఏళ్లకే ఎంపీ..
ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పుర్ ప్రాంతంలో 'మహారాజ్ జీ' అని పిలుస్తుంటారు. ప్రఖ్యాత గోరఖ్‌నాథ్ ఆలయ మఠాధిపతిగా అయన సేవలందించినందుకే అక్కడ అంత గుర్తింపు. యోగి రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలయ్యింది. 26 ఏళ్లకే గోరఖ్‌పుర్ నుంచి భాజపా తరఫున ఎంపీగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అప్పటికి పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు ఆయనే కావడం గమనార్హం. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు ఇదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయదుందుభి మోగించారు.
UP CM Yogi News
హిందూ యువ వాహిని స్థాపన..
2002లో భాజపాతో విభేదాలు వచ్చినప్పుడు హిందూ యువ వాహిని సంస్థను స్థాపించారు యోగి ఆదిత్యనాథ్. అనతికాలంలోనే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా గోరఖ్‌పుర్‌లోని యువతపై ఇది ఎక్కువగా ప్రభావం చూపింది. పెద్ద సంఖ్యలో యువత ఇందులో భాగమయ్యారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లను యోగికి అనుకూలంగా మార్చడంలో విశేషంగా తోడ్పడింది. 2002లో భాజపాకు పోటీగా అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున తన అనుచరులను బరిలోకి దించారు యోగి. వీరిని గెలిపించుకోవడానికి హిందూ వాహిని అసమానంగా ఉపయోగపడింది. గోరఖ్‌పుర్ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన అప్పటి కేబినెట్ మంత్రి, భాజపా నేత శివ్ ప్రతాప్ శుక్లాను ఎన్నికల్లో గట్టిదెబ్బ కొట్టారు. మహాసభ నుంచి పోటీ చేసిన రాధామోహన్ దాస్ అగర్వాల్.. ఘన విజయం సాధించారు. యోగి హవాకు.. శివ్ ప్రతాప్ శుక్లా ఓట్ల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. యోగి వ్యూహాలు, హిందూ వాహిని క్షేత్రస్థాయి పనితీరు ఇందుకు ప్రధాన కారణం.
2002 ఘటనల తర్వాత.. కమలం పార్టీకి, యోగికి మధ్య చాలాసార్లు గిల్లిగజ్జాలు కొనసాగినప్పటికీ.. తర్వాత భాజపా గూటికే చేరారు యోగి ఆదిత్యనాథ్. అప్పటి నుంచి హిందూ వాహిని రాజకీయంగా నెమ్మదించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అగ్రశ్రేణి హిందుత్వ నేతగా ఎదిగారు.
గోరఖ్‌పుర్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ..
యోగి 2017లో భాజపా ప్రముఖ ప్రచారకర్తగా ఉండటం వల్ల పార్టీకి ఎంతో ప్రయోజనం జరిగిందని, మరీ ముఖ్యంగా గోరఖ్‌పుర్‌లో ఆయన ప్రభావం అద్భుతమని కమలం నేతలే చెప్పారు. అందుకే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్ ప్రాంతంలో 62 స్థానాలకు భాజపా 44 చోట్ల విజయం సాధించిందని గుర్తు చేశారు. యోగి ప్రభావంతో ఈ ప్రాంతంలో ఎస్పీ, బీఎస్పీ ఏడు స్థానాలకే పరిమితమయ్యాయి.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్(అర్బన్) నుంచి యోగినే స్వయంగా పోటీ చేస్తున్నందున ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతామని పోలింగ్‌కు ముందే భాజపా నేతలు అన్నారు. గోరఖ్‌పుర్ పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా యోగి పేరును భాజపా ప్రకటించగానే హిందూ యువ వాహిని సభ్యులంతా మరోసారి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో యోగికి మద్దతు కూడగట్టారు. స్థానిక భాజపా నేతలతో కలిసి పనిచేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ యోగికి మద్దతుగా పెద్దఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో యోగి చేసిన పనులను ప్రజలకు వివరించారు. భాజపా మరోమారు అఖండ విజయం సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు.
లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపు..
గోరఖ్‌పుర్ అర్బున్ నుంచి పోటీ చేసిన యోగి 1,02,399 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. అంతేగాకుండా సీఎంగా ఐదేళ్ల కాలం పూర్తి చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. భాజపా 270కి పైగా స్థానాలు కైవసం చేసుకుంది.
ఇవీ చదవండి: బుల్డోజర్లు, జేసీబీలతో భాజపా కార్యకర్తల సంబరాలు