కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం (Mumbai Karnataka Region) పేరును కిట్టూర్-కర్ణాటకగా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై పేరు మార్పు గురించి ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వివాదాలు తరచూ తలెత్తుతున్న (Mumbai Karnataka Region) నేపథ్యంలో వాటికి పాత పేర్లనే కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ-కర్ణాటకగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ముంబయి-కర్ణాటక పేరును కిట్టూర్- కర్ణాటకగా మారుస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు సీఎం తెలిపారు.
"కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరిహద్దు వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలు పరిష్కారమైనా.. పేర్ల వల్ల తరచూ ఈ అంశం చర్చలకు దారితీస్తోంది. అసలు ఉత్తర కర్ణాటకను ముంబయి-కర్ణాటక (Mumbai Karnataka Region) అని పిలవాల్సిన అవసరమేముంది? అందుకే పేరు మారుస్తున్నాం" అని సీఎం బొమ్మై తెలిపారు. ప్రాంతీయ అసమానతలను అంతం చేసే దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. కిట్టూర్-కర్ణాటక ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : మనీలాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అరెస్ట్