Opposition presidential candidate: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు యశ్వంత్ సిన్హా. ఈ పోటీలో తనకు మద్దతుగా నిలవాలని భాజపాలోని తన మిత్రులను సంప్రదిస్తానని చెప్పారు. ఒకప్పుడు తాను ఉన్న కమల దళానికి, ప్రస్తుత పార్టీకి చాలా తేడా ఉందన్నారు. భాజపాలో అంతర్గత ప్రజాస్వామ్యం కరవైందని విమర్శించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను నాలుగో చాయిస్గా ఎంపిక చేసినప్పటికీ తనకు ఎలాంటి భేషజాలు లేవని, 10వ చాయిస్గా అవకాశం వచ్చినా సంతోషంగా స్వీకరించేవాడినని చెప్పారు. ఈ ఎన్నికలు ఓ మహాయుద్ధం అని అభివర్ణించారు.
జులై 18న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ సమర్పించిన అనంతరం ఈమేరకు మీడియాతో మాట్లాడారు సిన్హా. ప్రతీకాత్మకత రాజకీయాల్లో భాగంగానే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ అవకాశం ఇచ్చిందన్నారు. గిరిజనులు, దళిత వర్గాల సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రభుత్వం గిరిజన మహిళను ఎంపిక చేసినంత మాత్రాన.. ఆ వర్గానికి ఏం ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలను నిరంకుశ పాలనకు, స్వేచ్ఛకు మధ్య పోరుగా అభివర్ణించారు.
ప్రచార కమిటీ: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం కోసం 11 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా జైరాం రమేష్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్‌రాయ్, సీతారాం ఏచూరి, రాంగోపాల్ యాదవ్, ప్రఫుల్ పటేల్, గడ్డం రంజిత్ రెడ్డి, మనోజ్ ఝా, డి.రాజా, సుధీంద్ర కులకర్ణి, శివసేన నుంచి ఒకరు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ఈ కమిటీ రూపొందించనుంది.
ఇదీ చదవండి: ద్రౌపది X యశ్వంత్.. గెలుపెవరిది? 'ఇంద్రధనుస్సు' కూటమి మేజిక్ చేసేనా?