పరిశ్రమలు, విద్యాసంస్థలతోపాటు విద్యావంతులు, ఉత్తరాదివారు, ముస్లింలు, క్రైస్తవులు, తెలుగువారు ఉంటున్న తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ పోటీ చేస్తున్నందున.. అన్ని రాజకీయ పార్టీలూ ఈ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించాయి. తన కరిష్మాతో గెలుస్తానని కమల్.. సానుభూతి, అన్నాడీఎంకే కూటమి బలంతో విజయాన్ని సాధిస్తానని వానతి శ్రీనివాసన్... సర్వే ఫలితాలతో తన విజయం ఖాయమైందని డీఎంకే కూటమి అభ్యర్థి మయూరా జయకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వానతి శ్రీనివాసన్, మయూరా జయకుమార్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కమల్ రాకతో ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోతున్నామని పలువురు తటస్థులు 'ఈనాడు' ప్రతినిధితో పేర్కొన్నారు.
మైలాపూర్ నుంచి ఇటు..
కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థులు తమిళనాడులోని 133 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇతర స్థానాల్లో సమత్వు మక్కల్ కట్చి(సినీనటుడు శరత్‌కుమార్ పార్టీ) ఇండియా జననాయగ కట్చి, ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలుత కమల్ చెన్నైలోని మైలాపూర్ నుంచి పోటీచేయాలని భావించినా... సామాజికవర్గ ముద్రపడుతుందన్న ఉద్దేశంతో ఇటు వచ్చారు. అదీకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి 1,44,829 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలోనే 23,838 ఓట్లు లభించాయి. దీంతో కమల్ ఈ స్థానాన్నే ఎంచుకొన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కోయంబత్తూర్ దక్షిణంలో ఇప్పటివరకు రెండు సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థే గెలిచారు.
ఇదీ చదవండి: కుష్బూ దోశలు- స్మృతి దాండియా స్టెప్పులు
రోడ్ షోల ద్వారా అభ్యర్థన..
కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా.. కమల్, వానతి శ్రీనివాసన్, మయూరా జయకుమార్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యంగా.. వానతి శ్రీనివాసన్ నుంచి కమల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో కమల్ రోడ్ షోలు నిర్వహిస్తూ టార్చ్‌లైట్ చూపించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యువతీయువకులు కూడా ఎక్కువ సంఖ్యలో రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.
- ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి వానతి శ్రీనివాసన్.. ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు. ఆమె అన్నాడీఎంకే నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా భాజపా తరఫున పోటీచేసిన వానతి శ్రీనివాసన్ అన్నాడీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 33 వేల వరకు ఓట్లు సాధించి, మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తున్నందున విజయం వరిస్తుందన్న ధీమాతో ఉన్నారు.
- డీఎంకే కూటమి అభ్యర్థి(కాంగ్రెస్) మయూరా జయకుమార్.. పలువురు నేతలతో కలిసి ముఖ్య కూడళ్లు, ప్రార్థనాలయాల వద్ద ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున పోటీచేసి, రెండో స్థానానికి పరిమితమయ్యారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ ప్రభావం కారణంగా ఓటర్ల మద్దతు తనకే లభిస్తుందని మయూరా జయకుమార్ పేర్కొంటున్నారు.
- కోయంబత్తూరు దక్షిణ స్థానాన్ని భాజపాకు కేటాయించడం ఇక్కడి అన్నాడీఎంకే శ్రేణులకు రుచించడంలేదు. భాజపా అభ్యర్థి వానతి శ్రీనివాసన్‌కు అన్నాడీఎంకే నేతల నుంచి కొన్నిచోట్ల సహకారం అందడంలేదు. భాజపాకు ఈ స్థానాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్ మద్దతుదారులు గతంలో ఆందోళనకు దిగారు. పలువురు పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'ఆమె'కు వేతనమిస్తే తప్పేంటి?
జిల్లాలోనే చిన్న నియోజకవర్గం
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో కోయంబత్తూర్ దక్షిణం ఏర్పడింది. కోయంబత్తూర్ జిల్లాలో పది శాసనసభ నియోజవకర్గాలు ఉండగా.. ఇది ఆ జిల్లాలో చిన్న నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2,52,389 మంది ఓటర్లు ఉన్నారు.
కమల్ బలం.. కరిష్మా !
నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న కమల్‌ను చూసేందుకు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ ఆయనతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రచారంలో సందడి కనిపిస్తోంది. తన పార్టీ సిద్ధాంతాలు, వ్యక్తిగత కరిష్మా, నియోజకవర్గంలో విద్యావంతులు ఎక్కువగా ఉండడం వంటి అంశాలు తనను గెలిపిస్తాయని కమల్ భావిస్తున్నారు. అయితే, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన కమల్.. నియోజకవర్గవాసులకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు? అని కామరాజపురం వాసి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. కమల్ సిద్ధాంతాలు, హామీలు ఆలోచింపజేస్తున్నాయని, ఓటు వేయడంపై మాత్రం తానింకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. నియోజకవర్గ ఓటర్లు సెల్వి, రామకుమార్ మాట్లాడుతూ, ఇటీవలే డిగ్రీ పూర్తి చేశామని, కమల్‌లాంటి వారు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని చెప్పారు.
ఇవీ చదవండి: