wife killed her husband: పంజాబ్ అమృత్‌సర్‌లో అమానవీయ ఘటన జరిగింది. బీమా సొమ్ము కోసం భర్తనే హత్య చేసింది ఓ భార్య. ఆపై కొందరు గుర్తుతెలియని దుండగులు తన భర్తను చంపారంటూ పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు మంగళవారం ఆమెను విచారించగా.. బీమా సొమ్ము కోసమే తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు జండియాల డీఎస్పీ గురు సుఖ్వీందర్ సింగ్ తెలిపారు.
ఇదీ జరిగింది: అమృత్సర్ బులారా గ్రామానికి చెందిన మంజిత్‌సింగ్‌కు నరీందర్ కౌర్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కాగా మంజిత్‌సింగ్ గత 20 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వీరి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇదే విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్న నరీందర్ కౌర్ తన భర్తను హత్యచేయాలని పన్నాగం పన్నింది. నామినీగా తన పేరు పెట్టి భర్తకు బీమా చేయించింది. తన భర్త మరణిస్తే బీమా డబ్బులు వస్తాయనుకున్న నరీందర్.. మందులు కొనడానికి వెళుతున్న అతడ్ని డెహ్రీవాల్ గ్రామ సమీపంలో పదునైన ఆయుధంతో కొట్టి చంపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య