భర్త నాలుకను నోటితో కొరికి, తెగ్గోసింది ఓ భార్య. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడే పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్నా అనే వ్యక్తి తన భార్య సల్మా, పిల్లలతో నివసిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న వివాదం కారణంగా సల్మా తన పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. మున్నా భార్య పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లడానికి అత్తింటికి వచ్చాడు. భార్యను ఇంటికి రమ్మని పిలిచాడు.
కానీ భర్తతో అత్తింటికి వెళ్లడానికి నిరాకరించింది సల్మా. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను నోటితో కొరికింది. తీవ్రంగా గాయపడిన మున్నా.. కింద పడిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మున్నా భార్య సల్మాను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భవనం పైనుంచి కుక్కను విసిరేసిన దుండగులు..
మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. ఇందోర్లోని ఓ నివాస భవనంలోని 6వ అంతస్తు నుంచి కుక్కను కిందికి తోసేశారు కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు. లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ అమర్ గ్రీన్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. దీనిపై పియాన్షు జైన్ అనే కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.