మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అనగానే.. 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తాం. నిజమే. కానీ.. ఆ రోజున మనకు వచ్చింది పాక్షిక స్వాతంత్ర్యమే! బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్-1947 ప్రకారం డొమినియన్ స్టేటస్ (స్వపరిపాలన) మాత్రమే ఆ సమయంలో భారత్‌కు లభించింది. చట్ట ప్రకారం స్వపరిపాలన చేసుకున్నా, ఇంకా దేశం బ్రిటన్ రాచరికం కింద ఉన్నట్లే లెక్క. తమ సామ్రాజ్యంలోని స్వతంత్ర రాజ్యాలకు బ్రిటన్ స్వపరిపాలన హోదా ఇచ్చేది. ఈ హోదా పొందిన దేశాలకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. అయితే బ్రిటన్ రాచరికానికి లోబడి ఉండాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు స్వతంత్రమైనా.. ఇప్పటికీ బ్రిటిష్ రాజు లేదా రాణికి విధేయులుగానే ఉంటున్నాయి. 1950 జనవరి 26న సొంత రాజ్యాంగ ఆవిష్కరణతో.. భారత్ ఆ విధేయతకు చరమగీతం పాడింది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. పాకిస్థాన్ మాత్రం 1956 వరకు అలాగే బ్రిటిష్ రాచరికం కిందే కొనసాగింది.
పంద్రాగస్టే ఎందుకంటే?
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం 1948, జూన్ 30 లోపు భారత్‌కు అధికారపగ్గాలు అప్పగించే అధికారాన్ని వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌కు బ్రిటన్ పార్లమెంట్ అప్పగించింది. మరి అలాంటప్పుడు దాదాపు 11 నెలల ముందే ఎందుకని స్వాతంత్ర్యం అప్పగించారు? అన్నేళ్లూ అడిగినా నాన్చినవారు.. ముందే ఎందుకని ముహూర్తం పెట్టేశారు?
చరిత్రను చూస్తే.. ఇందుకు ప్రధాన కారణం ఆనాటి వైస్రాయ్ మౌంట్బాటనే అని తేలుతోంది. 1948 జూన్ దాకా సమయమున్నా, ముందుగానే ఇచ్చేయాలన్న నిర్ణయం పూర్తిగా ఆయనదే! దేశవిభజన నిర్ణయంతో.. భారీస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ.. అల్లకల్లోల పరిస్థితులు రాజ్యమేలసాగాయి. వాటిని అదుపు చేయటం బ్రిటిష్ ప్రభుత్వం వశం కాలేదు. దీంతో.. వీలైనంత త్వరగా స్వాతంత్ర్యం అప్పగించేయాలని మౌంట్‌బాటన్ అనుకున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ఇద్దామనుకున్నారు. కానీ చివరకు తనకు అచ్చి వచ్చిన ఆగస్టు 15వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు.
మౌంట్‌బాటన్ ఆగస్టు 15 సెంటిమెంటుకు ఓ కథ ఉంది. రెండు సంవత్సరాల క్రితం 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. ఆ సమయంలో మిత్ర దేశాల దక్షిణాసియా కమాండ్‌కు మౌంట్‌బాటన్ నేతృత్వం వహించారు. ఆ సెంటిమెంట్ పంద్రాగస్టు వైపు మౌంట్‌బాటన్‌ను మొగ్గుచూపేలా చూసింది. "ఆగస్టు లేదా సెప్టెంబర్ కల్లా అప్పగిద్దామనుకున్నా. అనుకోకుండా ఆగస్టు 15 గుర్తుకొచ్చింది. ఎందుకంటే జపాన్ లొంగిపోయి అప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి కానుంది" అని మౌంట్‌బాటన్ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' పుస్తకంలో తెలిపారు. అయితే.. స్థానిక జ్యోతిషుల ఒత్తిడి మేరకు.. తిథులు నక్షత్రాల ప్రకారం.. అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించారు. అలా.. పంద్రాగస్టునాడు భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.
ఇదీ చదవండి: గాంధీ 150: దేశ విభజనలో మహాత్ముడి పాత్ర ఎంత?