దేశంలో ఏటా 1.37 లక్షల శతకోటి ఘనపుటడుగు(టీఎంసీ)ల వర్షపు నీరు అందుబాటులో ఉండగా, ఇందులో దాదాపు 66 వేల శతకోటి ఘనపుటడుగులు నదుల ద్వారా ప్రవహిస్తోంది. దేశంలో ఎనిమిది పెద్ద, 400 చిన్న నదులు ఉన్నాయి.
18 వేల శతకోటి ఘనపుటడుగుల జలం హిమానీ నదాలు, గంగానది ద్వారానే ప్రవహిస్తోంది. ఇందులో నాలుగు వేల టీఎంసీలు మాత్రమే గరిష్ఠంగా వినియోగం అవుతోంది. మిగతా నీరంతా సముద్రం పాలవుతోందని కేంద్ర జలసంఘం 2018లో వెల్లడించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 137 బేసిన్లు, సబ్ బేసిన్లు, 71 నీటి మళ్ళింపు సముదాయాలను అధ్యయనం చేసి- కావేరి, పెన్నా బేసిన్లలో తీవ్ర నీటి సమస్య ఉందని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలోనూ నీటి సమస్య ఉన్నట్లు పేర్కొంది.
కృష్ణా పరీవాహకంలో ఒకవైపు ఏటా నీటి ఎద్దడి నెలకొంటుండగా- మరోవైపు, అయిదేళ్లకోసారి దాదాపు వెయ్యి టీఎంసీల జలం సముద్రంలో కలుస్తోంది. గోదావరి నుంచి ఏటా సగటున 2,500 శతకోటి ఘనపుటడుగుల వరకు సాగరాన్ని చేరుతోంది.
జాప్యంతో పెరుగుతున్న నిర్మాణవ్యయం
నదుల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నా- వాటి అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో అంచనాలు ఏటా మారిపోతున్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో- ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండగా 1941లో ఎల్.కృష్ణయ్యర్ పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.6.5 కోట్ల వ్యయం అవుతుందని తేల్చారు. ఆ వ్యయం 1947 నాటికి రూ.129 కోట్లకు చేరింది. 2004లో భూమి పూజ చేసే నాటికి అది రూ.8,261 కోట్లకు, తాజాగా రూ.55 వేల కోట్లకు చేరింది.
2008లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు అంచనా వ్యయం రూ.17వేల కోట్లు. అది 2020 నాటికి రూ.80వేల కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన నర్మదా డ్యాం నిర్మాణం విషయంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో 1986-87లో అంచనా వేసుకున్న రూ.6,406 కోట్ల వ్యయం 2017లో ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి దాదాపు రూ.47,300 కోట్లకు చేరింది. ఇప్పటికీ కాల్వల నిర్మాణం పూర్తికాలేదు. ఈ డ్యాం నిర్మాణానికి 1965 ఏప్రిల్ అయిదో తేదీన నాటి ప్రధాని నెహ్రూ పునాది రాయి వేశారు!.
మనదేశంలో ఒక్కో ప్రాజెక్టుకు 30 నుంచి 60 సంవత్సరాల సమయం పడుతోంది. చైనాలోని యాంగ్జీ నదిపై త్రీ గోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి 1992లో ఆమోదం తెలుపగా, 1994 డిసెంబరులో నిర్మాణం ప్రారంభమై, 2012 నాటికి పూర్తయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టును అక్కడ 18 ఏళ్లలో పూర్తి చేయగా, అందులో పదోవంతు కూడా లేని మన జలాశయాల నిర్మాణం మాత్రం దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది!.
నీటి వృథాతో అనర్థం
దక్షిణాది నదులను ఉత్తర భారత నదులతో అనుసంధానించాలని 19వ శతాబ్దంలోనే సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించారు. స్వాతంత్య్రం అనంతరం 1970 దశకంలో అప్పటి కేంద్ర నీటిపారుదల మంత్రి డాక్టర్ కేఎల్ రావు దీనిపై భారీ కసరత్తుతో నివేదిక రూపొందించారు. హిమాలయ ప్రాంతంలోని గంగా బేసిన్‌ను బ్రహ్మపుత్రతో అనుసంధానించాలని ప్రణాళికను సిద్ధం చేశారు. ఉత్తరాది నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నివేదిక మూలన పడింది. నదుల అనుసంధాన ప్రక్రియ యోచన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర నీటి వనరుల మంత్రిత్వ శాఖ సుమారు 50కి పైగా నివేదికలు తయారు చేసింది.
ఇటీవల పలుమార్లు సమావేశమైన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కాసింత ఆశావహ పరిణామంగా కనిపిస్తోంది. గోదావరిలో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని ఆ రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకునేలా నదుల అనుసంధానాన్ని సమన్వయీకరించాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ స్పష్టం చేసింది. గోదావరి-కావేరి అనుసంధానం వల్ల తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లోని ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ ప్రకటించింది. ఏవైనా ఎన్నికలు ఉన్నప్పుడే నదుల అనుసంధానం అంశం వెలుగులోకి వస్తోందన్న అపవాదును ప్రభుత్వాలు తొలగించుకోవాలి. భవిష్యత్తులో తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కోవాలంటే జలాన్ని వృథా చేసే ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిందే.
- ఎం.ఎస్.వి.త్రిమూర్తులు