White Tigress Gives Birth to Two Cubs : ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని మైత్రి బాఘ్ జంతు ప్రదర్శనశాలలో ఓ తెల్ల పులి రెండు కూనలకు జన్మనిచ్చిందని అధికారులు గురువారం వెల్లడించారు. రోమా అనే పులి గతేడాది సెప్టెంబర్ 8నే రెండు మగ పులులకు జన్మనివ్వగా- గురువారం ఈ విషయంపై ప్రకటన చేశారు జూ అధికారులు. దీంతో జూలోని తెల్ల పులుల సంఖ్య 10కి చేరిందని అధికారులు తెలిపారు. తెల్లటి రోమాలతో, నీలి కళ్లతో ఉన్న పిల్ల పులులు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. నాలుగు నెలల వయసు ఉన్న వీటిని ప్రజల సందర్శనార్థం శుక్రవారం ఎన్‌క్లోజర్‌లోకి వదులుతామని వివరించారు.
భిలాయ్ నగరంలో ఈ జంతు ప్రదర్శనశాల ఉంది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన హార్టికల్చర్ విభాగమైన టౌన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (టీఎస్డీ) దీన్ని నిర్వహిస్తోంది. 2023లో జూలోని పులులు రెండుసార్లు కూనలకు జన్మనిచ్చాయని అధికారులు తెలిపారు. రక్షా అనే ఆడ పులి 2023 ఏప్రిల్ 28న మూడు కూనలకు జన్మనిచ్చింది. వాటికి రుస్తం, రానా, బాబీ అని పేర్లు పెట్టినట్లు భిలాయ్ స్టీల్ ప్లాంట్ టీఎస్డీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జైన్ తెలిపారు.
"కూనల సంరక్షణ విషయంలో ఆడ పులులు చాలా జాగ్రత్తగా ఉంటాయి. రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాయి. వెటర్నరీ నిబంధనల ప్రకారం కొత్తగా జన్మించిన పులి కూనలను వాటి తల్లితో పాటు చీకటి గదిలో ఉంచుంతాం. ప్రత్యేక నిపుణులు వాటిని పర్యవేక్షిస్తారు. పాలు పట్టడం నుంచి వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం వరకు ఎప్పటికప్పుడు వాటిపై కన్నేసి ఉంచుతారు. ఇప్పటివరకు రోమా, దాని పిల్లలను తక్కువ లైటింగ్‌తో గుహ లాంటి వాతావరణం ఉన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచాం. చాలా వరకు సమయాన్ని పిల్లల్ని సాకేందుకే తల్లి పులి ఉపయోగించుకుంటుంది. అందుకే నాలుగు నెలల వరకు కూనలను జన్మించిన విషయాన్ని బహిర్గతం చేయలేదు."
-జైన్, భిలాయ్ స్టీల్ ప్లాంట్ టీఎస్డీ డిప్యూటీ జనరల్ మేనేజర్
అత్యధిక తెల్ల పులులతో భిలాయ్ మైత్రి బాఘ్ జూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని జైన్ వివరించారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న సంరక్షణ చర్యలు ఇందుకు ఉపయోగపడ్డాయని అన్నారు. '1997లో తరుణ్, తాప్సి అనే తెల్ల పులులను ఒడిశాలోని నందన్ జూ నుంచి ఇక్కడికి తరలించారు. 1999లో తాప్సి నాలుగు కూనలకు జన్మనిచ్చింది' అని తెలిపారు.
మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన 'ఆశ'- ఆనందంగా ఉందన్న కేంద్రమంత్రి
4 పిల్లలకు జన్మనిచ్చిన చీతా.. 70 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి