Goa assembly Polls: వైశాల్యపరంగా రెండో అతిచిన్న రాష్ట్రం, కొంకణ తీరంగా చెప్పుకునే 'గోవా'.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరోసారి గెలిచి పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం 'ఎవరికి వారే యమునా తీరే' అన్న చందంగా బరిలోకి దిగుతుండటం వల్ల ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది.
దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోయి.. తమకు లాభిస్తోందని భాజపా ఆశలు పెట్టుంది. అయితే ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న కాంగ్రెస్.. కాషాయ దళానికి గట్టి పోటీ ఇచ్చేది తామేనని అంటోంది. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆప్ కంటే.. భాజపాకు గోవాలో తామే ప్రత్యామ్నాయం అని నొక్కిచెబుతోంది. గత ఎన్నికల్లో 17 సీట్ల గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. భాజపా 13 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హంగ్ ఏర్పడింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో ప్రధాన పార్టీల బలాబలాలు.. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లు.. గెలుచుకున్న సీట్లు.. తదితర అంశాలను ఓసారి పరిశీలిద్దాం.