ETV Bharat / bharat

కనుమరుగైన పోరాట స్ఫూర్తి.. రాజకీయాల్లో ఉన్నా కనిపించని ముగ్గురు యోధులు - గుజరాత్ రాజకీయ వార్తలు

గుజరాత్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ పేర్లు బలంగా వినిపించాయి. ఈ ముగ్గురూ ప్రస్తుతం రాజకీయాల్లోనే ఉన్నా.. అప్పటి పోరాట స్ఫూర్తి మాత్రం కనుమరుగైంది.

where-is-those-three-young-turks-of-gujarat
హార్దిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ
author img

By

Published : Nov 26, 2022, 10:06 PM IST

"యువతలో పోరాట స్ఫూర్తి సన్నగిల్లుతోంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది". దాదాపు ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగంలో వినిపించే సూక్తి వచనాలివీ. 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను చూసిన వారికి మాత్రం ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే మోదీ, అమిత్‌షా తప్ప మరే పేరూ వినిపించని గుజరాత్‌లో.. అప్పట్లో ఓ మూడు పేర్లు బలంగా వినిపించాయి. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. వారే.. హార్దిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ. వేర్వేరు సామాజిక నేపథ్యాలు. వేర్వేరు ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ముగ్గురూ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలపై తమదైన ముద్ర వేశారు. భాజపా ఏకఛత్రాధిపత్యానికి దాదాపు బ్రేకులు వేశారు. పూర్తిగా విజయాన్నైతే అడ్డుకోలేకపోయినా.. దేశం చూపును తమవైపు చూపు తిప్పుకునేలా చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగానూ గెలుపొందారు. అనంతరం వివిధ సందర్భాల్లో అందరూ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇప్పుడు మాత్రం జిగ్నేశ్‌ మినహా మిగిలిన ఇద్దరూ భాజపాలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా! అప్పుడు పోరాట యోధులుగా ఉన్న ఆ ముగ్గురూ.. ఇప్పుడు కేవలం ఎన్నికల బరిలో నిలిచిన సాధారణ అభ్యర్థులుగా మారిపోయారు. అంతలా ఆ మూడు పేర్లూ వినిపించకుండా పోయాయి. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో ఐదేళ్లు ఆ రాష్ట్ర ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటారేమో గానీ.. ఓడితే మాత్రం వారి గురించి చర్చించే వారే ఉండరేమో!!

నూనుగు మీసాల వయసులోనే సంచలనం
హార్దిక్‌ అనగానే ఇప్పుడైతే అందరికీ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా గుర్తొస్తాడు. అదే 2017 ఎన్నికలకు ముందు మాత్రం హార్దిక్‌ అంటే పటీదార్‌ ఆందోళన సమితి (పాస్‌)కి నేతృత్వం వహించిన హార్దిక్‌ పటేలే గుర్తొచ్చేవారు. అంతలా దేశం దృష్టిని ఆకర్షించాడీ పటీదార్‌ ఉద్యమ నేత. పటీదార్లకు రిజర్వేషన్‌ కోరుతూ 2015లో అహ్మదాబాద్‌ వీధుల్లో 5 లక్షల మందితో ఉద్యమం జరిగింది. దానికి నేతృత్వం వహించారు హార్దిక్‌ పటేల్‌. అప్పటికి హార్దిక్‌ వయసు 20 ఏళ్లే. హార్దిక్‌ దెబ్బకు అప్పటి ఆనందీబెన్‌ పటేల్‌ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి పటీదార్లు, బ్రాహ్మణులు, బనియన్లకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు పదుల వయసులో ప్రభుత్వాన్ని కదిలించిన హార్దిక్‌ను తర్వాతి కాలంలో అల్లర్ల కేసులు వేధించాయి. దీంతో రాజకీయ మద్దతు అవసరం అయ్యింది. అలా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కేసుల కారణంగా ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పలు రాష్ట్రాల ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గానూ వ్యవహరించారు. కారణాలు తెలీనప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. దీంతో విరాగమ్‌ సీటు నుంచి అతడిని ఈసారి భాజపా బరిలో దింపింది. అందుకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే తేజశ్రీ పటేల్‌ను సైతం పోటీ నుంచి తప్పించింది. దీంతో ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు అదే పార్టీ నుంచి ఓ అభ్యర్థిగా బరిలో నిలిచారు హార్దిక్‌. జస్ట్‌ ఓ అభ్యర్థిగా!

'అల్పేష్‌' ఠాకూర్‌
2017లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన యువ నాయకుల్లో అల్పేష్‌ ఠాకూర్‌ ఒకరు. ఐదేళ్లు గడిచింది. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు అదే భాజపా నుంచి గాంధీనగర్‌ (సౌత్‌) స్థానానికి పోటీ చేస్తున్నారు. అదీ ఓ సాధారణ అభ్యర్థిగా! భాజపాకు బలమైన స్థానంలో గెలుస్తానో లేదోనన్న సంకోచంతో!! 2016లో మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని లేవనెత్తారు అల్పేష్‌ ఠాకూర్‌. పటీదార్‌ ఆందోళనకు వ్యతిరేకంగా ఓబీసీ-ఎస్టీ-ఎస్సీ ఏక్తా మోర్చా పేరిట నడిచిన ఉద్యమానికీ అల్పేష్‌ నేతృత్వం వహించారు. గుజరాత్‌ క్షత్రియ సేనను స్థాపించడమే కాకుండా రాష్ట్రంలో ఓబీసీ కమ్యూనిటీ నుంచి బలమైన నేతగా అవతరించారు. 2017 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి పఠాన్‌ జిల్లాలోని రధన్‌పూర్‌ స్థానం నుంచి గెలుపొందారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో అన్ని పదవులకూ రాజీనామా చేశారు. అదే ఏడాది భాజపాలో చేరారు. అనంతరం రధన్‌పూర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రఘు దేశాయ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు భాజపా తనకు తిరుగులేదూ అనుకుంటున్న గాంధీనగర్‌ (సౌత్‌) స్థానం నుంచి అల్పేష్‌ను బరిలో నిలిపింది. అయితే, ఇక్కడి స్థానిక నాయకత్వం ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఒకప్పటి ఉద్యమ నేత ఇప్పుడు విజయం కోసం పరితపించాల్సిన పరిస్థితి.

జిగ్నేశ్‌ కాంగ్రెస్‌ నుంచి..
దళిత యువకులపై దాడులను వ్యతిరేకిస్తూ గుజరాత్‌లో ఎదిగిన నేత జిగ్నేశ్‌ మేవానీ. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా. దళితులపై దాడులను నిరసిస్తూ 2017 ఎన్నికలకు ముందు భాజపాకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో జిగ్నేశ్‌ ఒకరు. ఆ ఎన్నికల్లో వాద్గాం సీటు నుంచి స్వతంత్రుడిగా పోటీ చేశారు. జిగ్నేశ్‌ విజయానికి అప్పట్లో కాంగ్రెస్‌ సహకరించింది. పోటీలో పార్టీ అభ్యర్థిని పెట్టకుండా అతడి విజయానికి దోహదపడింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన జిగ్నేశ్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడూ అదే వాద్గాం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఆ మధ్య గాడ్సేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై జిగ్నేశ్‌ మేవానీ అరెస్టయ్యారు. అస్సాంలోని కోక్రాఝార్‌లో భాజపా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు జిగ్నేశ్‌ మేవానీని గుజరాత్‌లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. 2017 ఎన్నికల తర్వాత ఈ ఒక్క సందర్భం మినహా జాతీయ స్థాయిలో మాత్రం జిగ్నేశ్‌ పేరు వినిపించ లేదంటే అతిశయోక్తి కాదు.

మొత్తానికి ఒకప్పుడు జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన ఈ ముగ్గురి భవితవ్యం త్వరలో తేలనుంది. డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా గుజరాత్‌ అసెంబ్లీకి పోలింగ్‌ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.