గర్భం దాల్చకుండానే పాలు ఇస్తున్న ఓ ఆవు దూడ.. కేరళ కన్నూర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. కంగోల్కు చెందిన సజేశ్.. 11 నెలల వయసున్న ఈ దూడకు యజమాని. 2021లో ఆవును, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్ సోకగా.. దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుతున్నాడు.
కొద్దిరోజుల క్రితం ఈ దూడ పొదుగు ఉబ్బిఉండడాన్ని గమనించింది సజేశ్ పొరుగింటి మహిళ. విషయాన్ని యజమానికి చెప్పింది. సజేశ్ పరిశీలించి చూడగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు మంచి మేత వేస్తూ.. కొన్నిరోజుల తర్వాత మరోసారి పాలు పితికి చూశాడు సజేశ్. ఈసారి చిక్కటి పాలు వచ్చాయి.
గత 15 రోజులుగా.. నిత్యం రెండు విడతల్లో ఆ దూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. అనుమానంతో వాటిని సజేశ్ పరీక్ష చేయించాడు. వాటితో ఏ ఇబ్బందీ లేదని తేలింది. దూడ ఇస్తున్న పాలలో 8.8శాతం వరకు కొవ్వు ఉంటున్నట్లు వెల్లడైంది. అరుదైన సందర్భాల్లో హార్మోన్లలో తేడా కారణంగానే ఇలానే జరుగుతుందని వైద్యులు సజేశ్కు చెప్పారు.