నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించని యూజర్లకు ఫీచర్లను పరిమితం చేయబోమని వాట్సాప్ గురువారం వెల్లడించింది. అయితే ప్రైవసీ అప్డేట్కు సంబంధించిన నోటిఫికేషన్ను మాత్రం వినియోగదారులకు పంపిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. పాలసీ అప్డేట్ వల్ల యూజర్ల గోప్యతలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది.
కొత్త ప్రైవసీ పాలసీని ఖాతాదారులు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. యూజర్ల ప్రైవసీనే తమ ప్రాధాన్యమని కేంద్రానికి సైతం వివరించినట్లు వాట్సాప్ పేర్కొంది.
"భారత ప్రభుత్వానికి మా స్పందన ఇదివరకే తెలియజేశాం. యూజర్ల గోప్యతే మా ప్రథమ ప్రాధాన్యమని వారికి స్పష్టం చేశాం. వచ్చే కొద్దివారాల్లో ప్రైవసీ పాలసీ అంగీకరించకపోయినా వాట్సాప్ ఫంక్షనాలిటీని పరిమితం చేయబోం. తాజా అప్డేట్ వ్యక్తిగత సందేశాలకు సంబంధించిన ప్రైవసీని ఏ విధంగానూ మార్చదు. వ్యాపార ఖాతాలతో ఏ విధంగా సంభాషించవచ్చు అనే విషయంపై అదనపు సమాచారాన్ని యుజర్లకు అందిస్తుంది. వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ఈ విధానాన్ని కొనసాగిస్తాం."
-వాట్సాప్ ప్రతినిధి
వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లు అమలు కాకముందే తమ యూజర్లు ప్రైవసీ పాలసీని అంగీకరించేలా నిరంతరం నోటిఫికేషన్లు పంపిస్తోందని కేంద్రం తన దిల్లీ హైకోర్టు పిటిషన్లో ఆరోపించింది. అలా చేయకుండా నిలువరించేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరింది.
ఇదీ చదవండి-