West Bengal MP Nusrat Jahan cheating case : సొంత ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజలను మోసం చేశారని తృణముల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌పై కేసు నమోదైంది. 429 మంది వద్ద నుంచి ఇల్లు కట్టిస్తామంటూ దాదాపు రూ. 28 కోట్ల మేర మోసం చేశారని ఆరోపించారు బాధితులు. దీనిపై గరియాహట్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మరోవైపు ఆమెపై అలిపోర్ కోర్టులో సైతం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్‌ను సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. దీనిపై ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తున్నారు.
ఇదీ జరిగింది..
నుస్రత్ జహాన్ డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ. 5.55 లక్షలకు త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
అయితే, అధికార తృణముల్ ఎంపీ కావడం వల్లే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు బీజేపీ నేత సంకూ దేబ్. బాధితులతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కార్యాలయానికి వెళ్లారు. బాధితులు ఎన్ని సార్లు వెళ్లినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ అంశాన్ని ఈడీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆమెకు అనేక సార్లు సమన్లు జారీ చేసినా.. హాజరు కాలేదని ఆరోపించారు. బాధితులకు 48 గంటల్లోగా న్యాయం జరగకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.
కాగా, గతంలో వివాహం విషయంలో తలెత్తిన వివాదంతో నుస్రత్ జహాన్ వార్తల్లో నిలిచారు. టర్కీలో వ్యాపారి నిఖిల్ జైన్‌తో ఆమెకు వివాహం కాగా.. ఆ పెళ్లి చట్టబద్ధం కాదని కోల్‌కతా న్యాయస్థానం ప్రకటించింది. ఆ తర్వాత నుస్రత్ ప్రెగ్నెన్సీపై వివాదం తలెత్తింది. నుస్రత్‌కు పుట్టబోయే బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్ స్పష్టం చేశారు. కాగా, కొద్దిరోజులకే ఆ బిడ్డకు తండ్రి ఎవరన్నది తెలిసిపోయింది. పూర్తి వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.