భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాళ్ల దాడి ఘటనపై బంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బంద్యోపధ్యాయ్, డీజీపీ వీరేంద్రలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రం హోంశాఖ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై ఇద్దరు ఉన్నతాధికారులతో సమీక్షించారు హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, నడ్డా పర్యటనలో రాళ్ల దాడి ఘటనపై అధికారులను హోంశాఖ కార్యదర్శి వివరణ కోరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అలాగే.. రాష్ట్రంలో పెరుగుతోన్న రాజకీయ హింస, దాడులపై దృష్టిసారించాలని కోరినట్లు చెప్పారు.
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాళ్ల దాడి ఘటన తర్వాత ఈ సమావేశం డిసెంబర్ 14న జరగాల్సి ఉంది. దిల్లీకి వచ్చేందుకు సీఎస్, డీజీపీ నిరాకరించటం వల్ల భేటీ రద్దయింది. అనంతరం శుక్రవారం సాయంత్రం దిల్లీలో హోంశాఖ ముందు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది హోంశాఖ. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిల్లీకి రాలేమని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతామని కోరాగా.. అందుకు అంగీకరించింది.