బంగాల్లోని దీదీ ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కారు మధ్య మరో వివాదం రాజుకునేలా కనిపిస్తోంది. బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Bengal CS) ఆలాపన్ బంధోపాధ్యాయ్ సేవల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఇందుకు కారణమవుతున్నాయి.
మే 31తో ఆలాపన్‌కు 60 ఏళ్లు నిండుతాయి. అదే రోజు ఆయన పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడగించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వాన్ని మే 17న అభ్యర్థించారు. కొవిడ్ పోరులో ఆయన సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. దీనికి మే 25న సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఆయన పదవి కొనసాగింపునకు అనుమతించింది.
ఇది జరిగి మూడు రోజులు కాకముందే కేంద్రం ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సీఎస్ బంధోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలచినట్టు శుక్రవారం సమాచారం పంపించింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం దిల్లీ వచ్చి రిపోర్టు చేయాలని ఆలాపన్‌కు సూచనలు ఇచ్చింది. దీనిపై భాజపా, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
ఇదీ చదవండి- 'బంగాల్ సీఎస్‌ను తక్షణమే రిలీవ్ చేయాలి'
స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి!
ఓ రాష్ట్ర సీఎస్‌ను డిప్యుటేషన్ మీద పంపించాలని కేంద్రం ఒత్తిడి చేయడం భారత స్వాతంత్ర్య చరిత్రలో ఇదే తొలిసారని టీఎంసీ(TMC) రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకే ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బలవంతంగా కేంద్ర డిప్యుటేషన్ మీద పంపడమా? స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి పరిణామం ఎప్పుడైనా జరిగిందా? మోదీ-అమిత్ షాలకు చెందిన భాజపా ఇంకెంత దిగజారుతుంది? వీరిద్దరిని బంగాల్ ప్రజలు అవమానించి, మమతా బెనర్జీకి అసమాన మెజారిటీ కట్టబెట్టినందువల్లే ఇదంతా జరుగుతోంది."
-సుఖేందు శేఖర్ రాయ్, టీఎంసీ ఎంపీ
మరోవైపు, ఈ వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయాంతన్ బసు తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో భాజపా పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి తర్వాతే బంధోపాధ్యాయ పదవీ కాలం పొడగించారని అన్నారు. ఇప్పుడు ఆయన సేవలను కేంద్రం కోరుకుంటోందని చెప్పారు.
కారణం అదేనా
బంధోపాధ్యాయ్ గత ఏడాది సెప్టెంబరులో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి బంగాల్లో వరదలపై ప్రధాని మోదీ శుక్రవారం జరిపిన సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి బంధోపాధ్యాయ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. కేవలం పదిహేను నిమిషాలు అక్కడ ఉండి వెనుదిరిగారు. ఆయనను వెంటనే దిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించడం వెనుక ఈ కారణం ఏమైనా ఉండొచ్చా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇదీ చదవండి- మోదీ- దీదీ 'భేటీ'పై వివాదం
అడకత్తెరలో...!
ఏదేమైనప్పటికీ.. ఆలాపన్ బంధోపాధ్యాయ్ రెండు ప్రభుత్వాల మధ్య చిక్కుకుపోయారని ఓ సీనియర్ బ్యూరోక్రాట్ పేర్కొన్నారు. సెంట్రల్ సర్వీస్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని అన్నారు. ఒకవేళ కేంద్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయన పెన్షన్ తదితర విషయాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తన ప్రతిష్ఠగా భావిస్తోందని అన్నారు. రెండు రాజకీయ శక్తుల మధ్య బంధోపాధ్యాయ్ ఇరుక్కున్నారని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి- narada case: 'నారదా కేసులో నవ్వుల పాలయ్యాం'