బంగాల్ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర సంఘటనలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శాసనసభా ప్రతిపక్ష నేత సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం, నందిగ్రామ్‌లో ముఖాముఖి తలపడటం తర్వాత వీరిద్దరూ భేటీ అవ్వడం ఇదే తొలిసారి.
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో వీరిద్దరూ కొంతసేపు సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం విరామ సమయంలో సువేందును దీదీ చాయ్ తాగేందుకు ఆహ్వానించారు. సువేందుతో పాటు కొందరు భాజపా నేతలు మమతతో కలిసి ఆమె ఛాంబర్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చాయి. ఈ సమావేశం అనంతరం సువేందు మాట్లాడుతూ.. 'ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ. ఇందులో మరే కోణం లేదు. సీఎం చాయ్‌కి ఆహ్వానించారు. కానీ నేను తాగలేదు' అని తెలిపారు. కాగా.. అంతకుముందు బెంగాల్ శాసనసభలో 'రాజ్యాంగ దినోత్సవం'పై చర్చ సందర్భంగా దీదీ మాట్లాడుతూ సువేందు అధికారి తన తమ్ముడి లాంటి వారని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ సువేందు అధికారి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీదీ-మోదీ కలిసిపోయారని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. 'కేంద్రం.. గురువారం బెంగాల్‌కు నిధులు విడుదల చేసింది. డిసెంబరు 5న మమత.. మోదీతో సమావేశం కానున్నారు. శుక్రవారం సువేందుతో సీఎం భేటీ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే దీదీ - మోదీ కలిసిపోతున్నారేమో' అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.
తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన సువేందు.. 2020 చివర్లో పార్టీని వీడి భాజపాలో చేరారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచే దీదీ బరిలోకి దిగగా.. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.
ఇవీ చదవండి : ఎక్సైజ్ పాలసీ కేసు ఫేక్.. 800 మంది దాడి చేసినా ఏం లభించలేదు : కేజ్రీవాల్
'బట్టలు లేకపోయినా మహిళలు బాగుంటారు'.. రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు