మహిళా క్యాడెట్లను ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) వృత్తి నిబద్ధత, నిష్పక్షపాతంతో స్వాగతం పలకాలని ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవణే పిలుపునిచ్చారు. పుణెలో జరిగిన ఎన్డీఏ 141వ పాసింగ్ అవుట్ పరేడ్‌ను సమీక్షించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు(nda passing out parade 2021).
"భారత సాయుధ దళాల్లో ఎన్డీఏకు అత్యున్నత స్థానం ఉంది. ఏళ్లుగా శిక్షణతో పాటు అనేక అంశాల్లో ఎన్డీఏ పరిణతి సాధించింది. ముందుకెళుతూ ఉంటే మహిళా క్యాడెట్లు కూడా ఒకరోజు చేరుతారు. పురుషులకు సమానంగా వారు శక్తిసామర్థ్యాలను కనబరుస్తారని ఆశిస్తున్నా. లింగసమానత్వానికి ఇదొక అడుగు. ఈ విషయాన్ని సైన్యం ఎప్పుడూ గౌరవిస్తుంది. నిబద్ధత, నిష్పక్షపాతానికి భారత సాయుధ దళాలపై ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. మునుపటి విధంగానే మహిళలకు స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నా. "
--- ఎం ఎం నరవణే, ఆర్మీ చీఫ్.
మహిళల కోసం ఎన్డీఏ ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తామని గత నెలలో సుప్రీంకు కేంద్రం తెలిపింది. అయితే అప్పటివరకు వాయిదా వేయడం తగదని, ఈ నవంబర్లోనే పరీక్షలు పెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నరవణే వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.
వేడుకలో పాల్గొన్న నరవణే తన సొంత అనుభవాలను పంచుకున్నారు.
"42ఏళ్ల క్రితం ఇదే పరేడ్‌లో నేను క్యాడెట్‌గా పాల్గొన్నా. ఏదో ఒకరోజు ఈ స్థితి నుంచి పరేడ్‌ను వీక్షిస్తానని ఆనాడు ఊహించలేదు. ఇక్కడి నుంచి మీ కఠోర సైనిక శిక్షణ, విద్య మొదలవుతుంది. త్రిదళాలకు చెందిన యూనిఫాంలు మీరు ధరిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరొక్కరే ఆధునిక యుద్ధాన్ని గెలవలేరు. అందరు కలిగట్టుగా ముందుకెళ్లాలి. అదే సమయంలో నూతన సాంకేతికతపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటే సవాళ్లను ఎదుర్కోవచ్చు."
-- ఎం ఎం నరవణే, ఆర్మీ చీఫ్.
ఇదీ చూడండి:- 'సుప్రీం' విజయం.. ఆ 39 మందికి శాశ్వత కమిషన్