టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన నినాదాల వల్ల బంగాల్లో ఎలాంటి మార్పు రాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. చొరబాటుదార్లను ఆపలేకపోయారని అన్నారు. తూర్పు మెదినీపుర్లోని ఈగ్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బంగాల్ను ఐదేళ్లలోనే చొరబాటు రహిత రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇచ్చారు.
బంగాల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయని అమిత్ షా ధ్వజమెత్తారు. పాఠశాలల్లో సరస్వతి పూజ నిర్వహించినందుకు ఉపాధ్యాయులపై దాడులు చేశారని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వస్తే ఏ పండగ నిర్వహించుకునేందుకైనా తాము అభ్యంతరం వ్యక్తం చేయబోమని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని 'బంగారు బంగాల్'గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఏడో వేతన కమిషన్ను అమలు చేస్తామని చెప్పారు అమిత్ షా.
"దీదీ.. మా, మాటి, మనుష్(తల్లి, మట్టి, మనషులు) అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ఏదైనా మార్పు వచ్చిందా? చొరబాటుదారుల నుంచి విముక్తి కల్పించారా? మేము బంగాల్ను ఐదేళ్లలోనే చొరబాటు రహిత రాష్ట్రంగా మార్చుతాం.
130 మంది కార్యకర్తలను చంపేశారు. టీఎంసీ గూండాలూ... మేము మిమ్మల్ని విడిచిపెడతామని అనుకోవద్దు. మే 2న బంగాల్లో అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఈ ప్రచార సభలో.. షా సమక్షంలో సువేందు అధికారి తండ్రి, టీఎంసీ ఎంపీ సిసిర్ అధికారి భాజపాలో చేరారు. అనంతరం.. అరాచకాల నుంచి బంగాల్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'