పార్లమెంటు వద్ద శాంతియుతంగా నిరసనలు చేపడతామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. బస్సుల ద్వారా ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటుకు చేరుకుంటారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికపై చర్చించేందుకు రైతు నేతలు బుధవారం సమావేశమవుతున్నట్లు చెప్పారు.
"200 మందితో పార్లమెంటుకు బస్సుల్లో చేరుకుంటాం. టికెట్ డబ్బులు చెల్లిస్తాం. పార్లమెంటు బయట కూర్చొని సమావేశాలు జరుగుతున్న సమయంలో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తాం. ఈ రోజు చర్చలు జరిపి నిరసనలపై ప్రణాళిక సిద్ధం చేస్తాం."
-రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
సాగు చట్టాల రద్దుపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈనెల 22 నుంచి పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తామని రైతు సంఘాలు ఇదివరకే ప్రకటించాయి. ఈ నిరసనలపై వ్యూహ రచనకు భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ విషయాలు వెల్లడించారు టికాయిత్.
ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇదీ చదవండి : 'మాటలే.. టీకాల్లేవు' - కేంద్రంపై రాహుల్ ధ్వజం