కాలికి గాయమైన నాలుగు రోజుల తర్వాత టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కోల్కతాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చక్రాల కుర్చీపైనే ర్యాలీ చేపట్టారు. ఆమె వెంట టీఎంసీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
మమత చక్రాల కూర్చీలో కూర్చోగా.. భద్రతా సిబ్బంది దానిని ముందుకు నడిపించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలకు మమత అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
నందిగ్రామ్ దివస్ సందర్భంగా.. మాయో రోడ్డు నుంచి హజ్రా వరకు ఐదు కిలోమీటర్ల దూరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు దీదీ. తాము ఎవరికీ తలవంచబోమని ర్యాలీ పాల్గొనే ముందు మమత ట్వీట్ చేశారు.
"ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగుతాం. నాకు నొప్పి చాలా ఉంది. కానీ రాష్ట్ర ప్రజల్లో ఉన్న బాధ కంటే ఇది ఎక్కువేమీ కాదూ. బంగాల్ గడ్డను రక్షించుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశాం. కానీ, ఏనాడు ఎవరికీ తలవంచలేదు."
--- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం.
ఎన్నికల నామినేషన్ వేసేందుకు ఈ నెల 10న నందిగ్రామ్ వెళ్లిన మమత.. అక్కడ గాయపడ్డారు. తనపై దాడి జరిగిందని ఆరోపించిన ఆమె.. కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
ఇదీ చూడండి:- బంగాల్ దంగల్: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!