ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బంగాల్‌లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అమలుచేయడం లేదన్న ప్రధాని మోదీ విమర్శలకు సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులైన 2.5 లక్షల మంది రైతుల జాబితాను తమ ప్రభుత్వం కేంద్రానికి పంపిందని ఆమె అసెంబ్లీలో వెల్లడించారు. మరి ఇప్పటిదాకా కేంద్రం ఎందుకు నగదు పంపిణీ చేయలేదని దీదీ ప్రశ్నించారు. ఈ పథకం కోసం తమకు 6లక్షల దరఖాస్తులు రాగా వెరిఫికేషన్ తర్వాత 2.5లక్షల మంది పేర్లతో జాబితాను కేంద్రానికి పంపినట్టు ఆమె తెలిపారు.
రైతుల ప్రయోజనాల కోసమే..
తమ ప్రభుత్వం రూ.72,200 కోట్ల పెట్టుబడులతో 19 పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోందని, వీటిద్వారా 3.29లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని దీదీ అన్నారు. ఈ నెల 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై ఆమె స్పందించారు. మరోవైపు, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కృషక్ బంధు పథకం కింద ఏటా ఇచ్చే రూ.5వేలను రూ.6వేలకు పెంచినట్టు చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు.
హల్దియాలో నిన్న జరిగిన సభలో మమత సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను బంగాల్‌లో అమలు చేయడంలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'దీదీ సర్కార్‌కు త్వరలోనే రామ్ కార్డ్'