దిల్లీ నాలుగు సరిహద్దుల్లో జనవరి 6న తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని జనవరి 7న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. వాతావరణ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జనవరి 7న సింఘూ, టిక్రీ, ఘాజిపుర్, పల్వాల్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీలు చేపడతామని స్వరాజ్ ఇండియా నాయకులు యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఇది జనవరి 26న నిర్వహించే గణతంత్ర పరేడ్కు ఇది రిహార్సల్ అని పేర్కొన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బుధవారం నుంచి 'దేశ్ జాగరణ అభియాన్' ప్రారంభిస్తామన్నారు. రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా దేశ్ జాగరణ అభియాన్ పేరిట ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అంబానీ, అదానీ సంస్థలకు చెందిన ఉత్పత్తులు, సేవలపై బహిష్కరణ కొనసాగిస్తామన్నారు. భాజపా, ఎన్డీఏ మిత్రపక్షాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆ పార్టీల నిజస్వరూపాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఆ పార్టీ నాయకుల ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు.
జనవరి 18న మహిళా కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ వెల్లడించారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆజాద్ హింద్ కిసాన్ దివాస్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. జనవరి 25, 26 తేదీల్లో ట్రాక్టర్ పరేడ్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వర్షంతో ఇబ్బందులు..
దిల్లీలో నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా సింఘూ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా రైతుల తాత్కాలిక గుడారాల్లోకి నీరు చేరింది.
11న సమావేశం..
ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని కూడా స్వయం సమృద్ధి సాధించేలా చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలపై చర్చించేందుకు ఈనెల 11న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ థోమర్ నేతృత్వంలోని సలహా కమిటీ సమావేశం కానుంది.
మోదీని కలిసిన పంజాబ్ నేతలు..
పంజాబ్ భాజపా నేతలు సుర్జిత్ కుమార్ జ్యాని, హర్జిత్ సింగ్ గ్రేవల్ ప్రధాని మోదీతో మంగళవారం సమావేశమయ్యారు. ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీలో పంజాబ్కు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు వారు చెప్పారు.