సరిహద్దులో ప్రశాంతతపై ఆధారపడే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని చైనా ప్రతినిధులతో తాము ఎన్నోసార్లు చెప్పామని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు భారత్తో అతిపెద్ద వాణిజ్య అనుబంధం ఉందని అన్నారు.
డ్రాగన్తో ఆర్థిక సంబంధాలను భారత్ కొనసాగించాల్సిన అవసరం ఉందని, అయితే.. అది ఇరుదేశాల మధ్య రాజకీయపరమైన ముఖ్య సమస్యలను పరిష్కరించే క్రమంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆసియా(ఎకానమికల్ డైలాగ్) ఆర్థిక సదస్సులో ఆయన ఆదివారం వర్చువల్గా పాల్గొన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఇటీవలి ప్రతిష్టంభనపై మాట్లాడారు.
సరిహద్దులో ప్రశాంతగా ఉంటేనే.. ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉంటాయని చైనా ప్రతినిధులతో మేం ఎన్నోసార్లు చెప్పాం. బలగాల ఉపసంహరణతో.. సమస్యల పరిష్కారంలో కాస్త పురోగతి కనిపిస్తోంది. చైనాతో భారత్కు అతిపెద్ద సరిహద్దు ఉంది. మనం ఓ చిన్న ప్రాంతం గురించే మాట్లాడుతున్నాం. లద్దాఖ్ సెక్టార్లోని ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కూడా మేం ప్రయత్నిస్తున్నాం.
-హర్షవర్ధన్ శృంగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి
భారత్-చైనా సరిహద్దులోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శృంగ్లా తెలిపారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ఈ చర్య ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దేశీయ నిఘా వ్యవస్థకు 'సింధు నేత్ర'