జమ్ముకశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సజావుగా సాగింది. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.



ఓటర్ల బారులు
జమ్ముకశ్మీర్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.69 శాతం ఓటింగ్ నమోదైంది. సాంబా జిల్లాలో అత్యధికంగా 59 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికల్లో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అధికారులు చెప్పారు.
ఓటేసేందుకు ప్రజలు తరలి రావడంపై హర్షం వ్యక్తం చేశారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఎముకలు కొరికే చల్లటి వాతావరణాన్ని లెక్కచేయకుండా ఓటింగ్లో పాల్గొనడం ఉత్సాహం కలిగిస్తోందని అన్నారు.

మరోవైపు ఎన్నికలకు ముందు షోపియాన్ జిల్లాలో అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఇందుకు గల కారణాలను అధికారులు వివరించలేదు. అయితే సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో ఈ జిల్లా ఉన్న నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది దశల్లో..
జమ్ముకశ్మీర్లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 28 ప్రారంభమై డిసెంబర్ 19 వరకు ఎన్నికలు సాగనున్నాయి. డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మొదటి దశలో.. 1,427 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి.