'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహాత్ముడు దండి యాత్రను మొదలుపెట్టిన సబర్మతీ ఆశ్రమం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భరత్ పట్ల భారతీయుల్లో మరింత స్ఫూర్తిని రగిలించడంలో దండియాత్ర కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మహాత్మునితో పాటు స్వాతంత్ర్య సమర యోధులకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని మోదీ కోరారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసే చరఖాలో ఆత్మనిర్భరతకు సంబంధించిన ట్వీట్లను జోడించనున్నట్లు చెప్పారు. ఇది ప్రజల ఉద్యమానికి హేతువుగా నిలుస్తుందన్నారు.