VK Singh On POK : పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకేపై కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ ఛీఫ్ జనరల్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో కలిసిపోతుందని.. అందుకు కొంత కాలం వేచి ఉండాలని అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకే ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ అక్కడి ప్రజలు చేస్తున్న డిమాండ్లపై మీడియా కేంద్ర మంత్రిని ప్రశ్నించింది. అందుకు స్పందించిన కేంద్రమంత్రి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే తనంతట తానే భారత్‌లో విలీనమవుతుందన్నారు. అయితే అందుకు కొంత సమయం పట్టొచ్చన్నారు. మరోవైపు భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవలే పీవోకే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి .
యుద్ధం అన్నది ఏ దేశ ఆర్థిక వ్యవస్థని అయినా తక్కువలో తక్కువ ఇరవై ఏళ్లు వెనక్కి నెడుతుంది. అందువల్ల యుద్ధం చేయాలనుకునే ముందు మనం ఆలోచించాలి. దీని ద్వారా మనం ఏం చేయాలి, దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని ఆలోచించాలి. మేం ఏమని భావిస్తాం అంటే యుద్ధం ఎప్పడూ చివరి ఉపాయం మాత్రమే. చూడండి పీవోకే మన భారత్‌లోకి వస్తుంది. అయితే అందుకు కొద్ది సమయం పడుతుంది.
-వీకే సింగ్, కేంద్ర మంత్రి
మరోవైపు భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు విజయం సాధించిందని వీకే సింగ్ అన్నారు. భారత్ ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని కొనియాడారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి. శాంతి భద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను భాజపా నేరుగా వినాలనుకుంటోందని.. అందుకే ఈ యాత్రను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే తమతో కలిసి యాత్రలో పాల్గొంటున్నారని వీకే సింగ్ తెలిపారు.
'త్వరలోనే పీఓకే స్వాధీనం'.. పాక్‌కు రాజ్‌నాథ్ తీవ్ర హెచ్చరికలు..
Rajnath Singh Pok Comment : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని కొంత కాలం క్రితం స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకేలో అరాచకాలు జరుగుతున్నాయని.. ఇలా చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పీఓకేలో చైనా సైనికుల సంచారం.. ఆర్మీ పోస్టులు, గ్రామాల్లో సర్వేలు