తమిళనాడులో ఓ పక్క ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా.. మరో పక్క ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారని అందరూ భావించిన శశికళ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. ఈమె మద్దతు ఎవరికో తెలియక అన్నాడీఎంకే శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. ఆన్నాడీఎంకే, ఏఎంఎంకే నేతలు ఎవరికివారు ఆమె మద్దతు తమకేనంటున్నా.. లోలోపల మాత్రం సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. కర్ణాటక జైలు నుంచి విడుదలైన శశికళ రాజకీయ ప్రవేశంపై పెద్దఎత్తున చర్చలు సాగాయి. కానీ..అనూహ్యంగా 'డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మన ప్రధాన ధ్యేయం కావాలి. మళ్లీ అమ్మ పాలన వచ్చేందుకు కృషి చేయాలి. ఆమె ఆశయాలు నెరవేరాలి. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా' అని మార్చి 3న సంచలన ప్రకటన చేశారు. దాంతో ఆమె ప్రకటనను అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఇరుపార్టీల ఎన్నికల ప్రచారంలో మాత్రం శశికళ ప్రస్తావన రావడం లేదు.
ఇదీ చదవండి:తమిళ బరిలో తెలుగు వెలుగులు!
అన్నాడీఎంకే సీనియర్ నేత ఒకరు.. డీఎంకేను ఓడించాలని శశికళ చెప్పడం ద్వారా తమ పార్టీని గెలిపించాలని పరోక్షంగా చెప్పారన్నారు. దేవర్ వర్గానికి చెందిన దినకరన్ అనుచరులు మాత్రం.. తమదే నిజమైన అన్నాడీఎంకే అయినందున శశికళ ప్రకటన తమకే అనుకూలమని అంటున్నారు.
శశికళ మాత్రం రాజకీయాల గురించి మరొక్క మాట కూడా చెప్పలేదు. చెన్నైలోని అగస్తియర్ దేవాలయాన్ని ఇటీవల సందర్శించారు. తాజాగా తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరువిడైమరు దూరులో ఉన్న మహాలింగస్వామి ఆలయాన్ని, తిరుచ్చిలోని శ్రీరంగం దేవాలయాన్ని సందర్శించారు. భర్త చనిపోయి మూడేళ్లు పూర్తవుతున్నందున ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు మరో 2 రోజులు తంజావూరు జిల్లాలోనే ఉండబోతున్నారు. తన పర్యటనలో విలేకర్లతో మాట్లాడేందుకు శశికళ విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?