Watchman Ranganna: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న తీవ్ర అస్వస్థత గురయ్యాడు. పులివెందులలోని ఆయన నివాసంలో ఉండగా రాత్రి ఆస్తమా ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు, ఆయనకు భద్రత కల్పిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. రంగన్నకు భద్రత కల్పిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్స్‌లో పులివెందుల నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పులివెందులలో ఆయన ఇంట్లో రంగన్న భార్య మాత్రమే నివాసముంటున్నారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని రెండేళ్ల కిందట జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సీఆర్పీసీ 164 కింద రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఈ ప్రత్యక్ష సాక్షిని కాపాడుకోవడానికి సీబీఐ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం రంగన్నకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆయన అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన తిరుపతికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణారెడ్డిని వివేకా హత్య జరిగిన రోజు లభ్యమైన లేఖ గురించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట పులివెందులలో కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీబీఐ ప్రశ్నించింది.