Visakha Ramky Pharmacity Land Grabbing Case Updates in Telugu : 2002లో విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మాసిటీ అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2004 మార్చి 11న APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation), రాంకీ సంస్థలు కలిసి రాంకీ ఫార్మాసిటీ ఇండియా లిమిటెడ్-RPCIL పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. సెజ్, నాన్ సెజ్ కలిపి 2,143 ఎకరాల్లో 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇందులో రాంకీ వాటా 89శాతం కాగా 11శాతం వాటాగా APIIC భూమిని సమకూర్చింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ప్రభుత్వ ఏర్పాడ్డాక జగన్నాటకానికి తెరలేచింది. కాలుష్య నివారణకు ఫార్మాసిటీ సరిహద్దుకు లోపల, బయట మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ పేరుతో కృత్రిమంగా అడవిని సృష్టించాలనేది నియమం. అప్పటి విశాఖపట్టణాభివృద్ధి సంస్థ-వుడా మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఫార్మాసిటీ లోపలివైపు 250 మీటర్లు, అంటే 973 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కోసం వదలాలి. అయితే రాంకీ ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డికి లబ్ధి చేకూరేలా అప్పటి సీఎం వైఎస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సీబీఐ వివరించింది.
ramky: రూ.1,200 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన రాంకీ సంస్థ
రాంకీ సంస్థ 133.74 కోట్లు అక్రమ లబ్ధి : గ్రీన్‌బెల్ట్ లోపలివైపు 50 మీటర్ల మేరకు 58.95 ఎకరాలు వదిలామంటూ 2005 ఫిబ్రవరిలో వుడాకు రాంకీ తన లేఅవుట్ సమర్పించింది. 59 ఎకరాలంటే కేవలం 15 మీటర్లే! ఇది మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధం. ఒకవేళ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలంటే ముసాయిదా నోటీఫికేషన్ ఇచ్చి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.తర్వాతే జీవోను సవరించాలి. ఇవన్నీ చేయకుండానే, మాస్టర్‌ప్లాన్‌కు భిన్నంగా లేఅవుట్‌ను ఆమోదించడం అక్రమమని సీబీఐ స్పష్టం చేసింది.
అప్పటి వుడా వైస్ ఛైర్మన్ జి.వెంకట్రామిరెడ్డి నేరపూరిత కుట్రతో ఫార్మాసిటీ లోపల 50 మీటర్లు, బయట 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌తో 2007 నవంబరు 26న ఫార్మాసిటీ లేఅవుట్‌ను ఆమోదించినట్లు. సీబీఐ తెలిపింది. దానివల్ల అయోధ్య రామిరెడ్డికి 200 మీటర్లు అంటే ఏకంగా 914 ఎకరాల ఆయాచిత లబ్ధి కలిగిందని స్పష్టం చేసింది. అలా అక్రమంగా పొందిన 200 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్లాట్లుగా విభజించి నాన్ సెజ్ పరిధిలో 38 ప్లాట్లను అమ్మడంతోపాటు సెజ్‌లో 4ప్లాట్లను లీజుకు ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. ఫలితంగా రాంకీ సంస్థ 133.74 కోట్లు అక్రమ లబ్ధి పొందినట్లు వివరించింది.
ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చెక్కు జారీ : జగన్ ప్రభావం కారణంగా సీఎం హోదాలో రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలతో అక్రమంగా లబ్ధి పొందిన అయోధ్య రామిరెడ్డి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయల ముడుపుల్ని తన కంపెనీల ద్వారా పెట్టుబడుల రూపంలో జగతిలోకి మళ్లించారు. దానికోసం అయోధ్య రామిరెడ్డి తన బంధువులతో ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,TWC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయించారు. రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సబ్ కాంట్రాక్టులు చేసినట్లుగా వర్క్ ఆర్డర్లు సృష్టించిలుగురు బంధువుల పేరిట 2 కోట్ల రూపాయలకు చెక్కులు ఇచ్చారు. తర్వాత ఆ నలుగురి సొమ్ము బ్యాంకు నుంచి TWC ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు బదిలీ అయింది. TWC 2007 డిసెంబరులో జగతి పబ్లికేషన్స్‌కు 2 కోట్ల రూపాయల చెక్కు జారీ చేసింది! తర్వాత భూమి కొనుగోలు అడ్వాన్సుల పేరిట ఈఆర్ఈఎస్ సంస్థకు 2008 ఫిబ్రవరిలో రూ.8 కోట్లు మళ్లించారు.
ఆస్తులు అటాచ్ : సీబీఐ తేల్చిన అంశాల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. 42 ప్లాట్ల అమ్మకం లీజు ద్వారా 133.74 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని సీబీఐ తేల్చగా ఇంకో 9 ప్లాట్లు కూడా అమ్మి మరో 101.29 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నట్లు ఈడీ తేల్చింది. ఈ కేసులో ఫార్మాసిటీలో విక్రయించని 16 ప్లాట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద2013, 2015లలో మొత్తం నాలుగు విడతల్లో జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపునకు చెందిన 356.59 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 10 కోట్ల రూపాయలు జగతి పబ్లికేషన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాగా మిగతావి రాంకీ గ్రూప్‌నకు చెందిన ఆస్తులు.
238 సార్లు విచారణ : రాంకీ కేసులో A1గా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి, A3గా జగతి పబ్లికేషన్స్, A4గా అయోధ్య రామిరెడ్డి, A5గా జి.వెంకట్రామిరెడ్డి, A6గా రాంకీ ఫార్మా సిటీని పేర్కొంటూ 2012 మే 7న CBI ఛార్జ్‌షీట్ వేసింది. వారిపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 420, 468, 471, అవినీతి నిరోధక చట్టంలోని 9, 11, 12 సహా వివిధ సెక్షన్లు నమోదు చేసింది. ఛార్జిషీట్ వేసి పదేళ్లవ్వగా హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో విచారణ ఇప్పటివరకూ 379 సార్లు వాయిదా పడింది. కేసు నుంచి తమ పేర్లను తొలగించాలంటూ జగన్ సహా నిందితులు వేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మిగతా ఛార్జిషీట్లలో నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాక కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ 2016 సెప్టెంబరు 16న ఆరుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులపై ఇప్పటివరకు 238 సార్లు విచారణ జరిగింది.
నేరం రుజువైతే జీవితఖైదు : సీబీఐ కేసుల్లోని సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే జగన్‌కు కనీసం ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం ఏడేళ్లు, 12ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష పడుతుంది. వెంకట్రామిరెడ్డిపై నమోదైన IPC 409 రుజువైతే కనీసం ఐదేళ్ల నుంచి జీవితఖైదు వరకు జైలుశిక్ష పడుతుంది. ఈడీ కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు పూర్తిస్థాయిలో జప్తు అవుతాయి. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. PMLA సెక్షన్-4 ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష కూడా పడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-8 ప్రకారం క్రిమినల్ కేసుల్లో కనీసం రెండేళ్ల జైలుశిక్ష పడితే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత కోల్పోతారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగేందుకు వీలుండదు. శిక్షాకాలంతో పాటు శిక్ష పూర్తయిన ఆరేళ్ల వరకూ అనర్హత కొనసాగుతుంది.
Jagan Disproportionate Assets Cases: రాంకీ కేసులో దర్యాప్తు పూర్తయింది.. కోర్టుకు తెలిపిన ఈడీ