రెండు నిర్దిష్ట ఉత్పరివర్తనలు కలిగిన కరోనా వైరస్ రకాలు.. యాంటీబాడీలను తట్టుకొంటాయని, వాటిని నిలువరించడంలో టీకాలు కూడా సమర్థంగా పనిచేయకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ చెప్పారు. ఈ రెండు మార్పుల వల్ల వైరస్ స్పైక్స్ ప్రొటీన్‌లోని ఒక భాగంలో భారీ మార్పు జరుగుతుందని వివరించారు. యాంటీబాడీలతో అతుక్కోవాల్సింది ఈ భాగమేనని చెప్పారు. అందువల్ల ఇలాంటి రకాలపై టీకాలు సమర్థంగా పనిచేయవన్నారు.
దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన ఒక రకం కరోనా వైరస్‌లో ఈ రెండు రకాల ఉత్పరివర్తనలు ఉన్నాయని చెప్పారు. వాటిని యాంటీబాడీలు సరిగా ఎదుర్కోలేకపోతున్నట్లు పరీక్షల్లోనూ తేలిందని చెప్పారు. వీటిని ఎన్501వై, ఈ484కే ఉత్పరివర్తనలుగా నామకరణం చేసినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ నలుగురికి, బ్రెజిల్ రకం ఒకరికి సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటీవల తెలిపింది. ఈ రకాల వైరస్లు భారత్‌లో సామాజిక వ్యాప్తి దశలో లేవని జమీల్ పేర్కొన్నారు. అయితే దేశంలో మొదలయ్యే కొత్త రకాల వైరస్‌లపై కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు.
"భారత్‌లో ఇప్పటికే 1.1 కోట్ల మందికి కొవిడ్ ఇన్ఫెక్షన్లు సోకాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే కొత్త రకం కరోనా వైరస్లు పుట్టుకొచ్చి ఉండొచ్చు. వాటిని గుర్తించేందుకు భారీగా జన్యుపరమైన పరిశీలనలు నిర్వహించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వశాఖలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది."
-షాహిద్ జమిల్, వైరాలజిస్ట్
ఇదీ చదవండి : మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్