కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి వ్యాక్సిన్(covid vaccine) తీసుకోవాలని ప్రభుత్వం ఎంతలా ప్రచారం చేస్తున్నా.. కొందరిలో టీకాపై ఉన్న అపోహలు ఇంకా వీడటం లేదు. వ్యాక్సిన్(covid vaccine) తీసుకుంటే తమకు ప్రాణహాని తలెత్తుతుందని భయపడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తర్ప్రదేశ్ కాస్గంజ్లో వెలుగు చూసింది. ప్రజలు టీకా తీసుకునేందుకు విముఖత చూపగా.. పోలీసులు రంగంలోకి దిగి వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అసలేమైందంటే..?
పటియాలీ తహసీల్దార్ రాజీవ్ నిగమ్ నేతృత్వంలోని అధికారుల బృందం.. కాస్గంజ్ వీధుల్లో గురువారం మధ్యాహ్నం అడుగుపెట్టింది. ఆ బృందం 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని ఆపి కొవిడ్ టీకా(covid vaccine) తీసుకోవాలని కోరింది. అయితే.. అందుకు నిరాసక్తి చూపించిన అతడు పారిపోవాలని యత్నించాడు. దాంతో అతణ్ని పట్టుకుని తమ వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం వద్దకు తీసుకువచ్చింది. అదే సమయంలో మరికొంతమంది కూడా పోలీసులను, అధికారులను చూసి పరారయ్యారు.
కాస్గంజ్ జిల్లాలో వివిధ గ్రామాల్లోని ప్రజలు కరోనా టీకాపై గందరగోళానికి గురవుతున్నారు. ప్రజలకు ఉన్న అపోహలను పోగొట్టేంగురు జిల్లా మేజిస్ట్రేట్.. ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేగాకుండా.. జిల్లా డిప్యూటీ మేజిస్ట్రేట్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఇన్ని చర్యలు చేపట్టినా టీకాపై ప్రజలు అపోహలను వీడటం లేదనే ఉదంతాలు బయటపడతున్నాయి.
ఇదీ చూడండి: వైరల్: బతికున్న పామును తింటే.. కరోనా రాదంట!
ఇదీ చూడండి: కరోనా వైరస్ ప్రొటీన్ కీలక గుట్టు కనుగొన్న శాస్త్రవేత్తలు