Nagaland Civilians Killed: నాగాలాండ్‌లో పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మిలిటెంట్ల వేటకు వెళ్లిన భారత బలగాలు.. మోన్ జిల్లా ఓటింగ్ వద్ద బొగ్గు గనిలో విధులు ముగించుకుని వెళ్తున్న కార్మికులపై కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా ప్రాంతంలో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్‌కు చెందిన మిలిటెంట్ల కదలికలు ఉన్నాయని అంతకుముందే భద్రతా దళాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న బలగాలకు బాధిత కూలీలు తారసపడటం వల్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.
బలగాల తీరుతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు బలగాలపై తిరగబడ్డారు. కొన్యాక్ యూనియన్ కార్యాలయం, అసోం రైఫిల్స్ శిబిరాలను ధ్వంసం చేశారు. సైనికుల వాహనాలను తగలబెట్టారు. కూలీలు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్న సమయంలో సైన్యం మెరుపు దాడి చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనకు కారణమైనవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
సైనికుడు మృతి
స్థానికుల దాడిలో ఓ సైనికుడు కూడా చనిపోగా.. మరో ఇద్దరు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పౌరుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత సైన్యం.. దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలను.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణెకు అధికారులు వివరించారు.
'న్యాయం జరిగేలా చూస్తాం'
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం నెఫ్యూ రియో.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని దురదృష్టమైన ఘటనగా అభివర్ణించిన నాగాలాండ్ సీఎం దీనిపై సిట్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయానికి దిల్లీలో ఉన్న ఆయన.. హుటాహుటిన నాగాలాండ్‌కు బయలుదేరారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ఇంటర్నెట్ సేవలు బంద్
జిల్లాలోని పరిస్థితులను అదుపు చేసేందుకు.. మొబైల్, ఇంటర్నెట్, డేటా సేవలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. ఘటనపై అపోహలు, వదంతులు వ్యాపించకుండా ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
'ప్రజలు శాంతించాలి'
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాగాలాండ్ గవర్నర్ జగదీశ్ ముఖి.. సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతికాముకులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు కాల్పుల ఘటనపై హోంమంత్రి అమిత్‌షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.
మండిపడ్డ విపక్షాలు..
నాగాలాండ్ ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్వదేశంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు.. అసలు హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ రాహుల్ ప్రశ్నించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరగాలన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: BSF raising day: 'డ్రోన్ విధ్వంసక సాంకేతికతతో భద్రత కట్టుదిట్టం'