kallakurichi student death: తమిళనాడు కళ్లకురిచి జిల్లా చిన్నసేలంలో తీవ్ర హింస చెలరేగింది. ఈ నెల 13న అనుమానాస్పదంగా మరణించిన 12వ తరగతి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన విధ్వంసకాండకు దారితీసింది. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం పక్కకు నెట్టి పాఠశాలలోకి చొరబడ్డారు. పాఠశాల బస్సులను, కొన్ని పోలీసు వాహనాలను తగలబెట్టారు. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని.. అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు సంయమనం పాటించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. పోలీసు విచారణ ముగిసిన అనంతరం.. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ, హోం శాఖ కార్యదర్శిని కళ్లకురిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
చిన్న సేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ హాస్టల్ ఆవరణలో 12వ తరగతి చదువుతున్న ఓ 17 ఏళ్ల బాలిక ఈ నెల 13న శవమై కనిపించింది. హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరణానికి ముందు ఆమె శరీరంపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె మృతితో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కడలూరు జిల్లా పెరియనాసలూరు గ్రామ ప్రజలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గత నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీబీ-సీఐడీకు ఈ కేసును అప్పగించాలని కోరుతున్నారు. బాలిక మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్ పోసి మరీ..
చరిత్ర సృష్టించిన భారత్.. 200 కోట్ల కొవిడ్ టీకా డోసుల పంపిణీ