స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి గ్రామంలోకి అడుగుపెట్టిన జిల్లా పరిపాలన ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సంఘటన రాజస్థాన్ పాలీ జిల్లాలో జరిగింది. రాయ్‌పుర్ సబ్‌డివిజన్ ప్రాంతంలోని పలు గ్రామాలను స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ ఉన్నతాధికారి సందర్శించ లేదు. ఇందులో సత్రుంగియా అనే గ్రామం కూడా ఉంది.
కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాయ్‌పుర్ సబ్ డివిజన్లో పర్యటిస్తున్నారు కలెక్టర్, ఎస్పీ. తమ గ్రామానికి ఓసారి రావాలని జిల్లా కలెక్టర్ అన్షదీప్, ఎస్పీ కల్‌రామ్ రావత్‌ను.. సంత్రుంగియా గ్రామస్థులు కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు.. పెద్దఎత్తున సిబ్బందిని వెంటబెట్టుకొని గ్రామానికి వెళ్లారు. తొలిసారి.. తమ ప్రాంతానికి తరలివస్తున్న అధికారులను చూసిన గ్రామస్థులు.. వారికి గుర్తుండేలా విభిన్నంగా స్వాగతం పలికారు.

పూల వర్షం..
ఒంటెలపై అధికారులను కూర్చోబెట్టిన గ్రామస్థులు.. వారిపై పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోని వీధి వీధి తిప్పుతూ ఊరేగించారు. అనంతరం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు అధికారులు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి: సైన్యంలోకి పుల్వామా అమర జవాను భార్య