Venkaiah Naidu At TANA 23rd Conference : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మరో అరుదైన గౌరవం లభించింది. వివిధ రంగాల్లో ఆయన చేస్తున్న ఉత్కృష్టమైన సేవలను ప్రశంసిస్తూ అమెరికా న్యూజెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీలో సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టారు. సెనేటర్ డయాగ్నన్, జనరల్ అసెంబ్లీ సభ్యులు కారాబిన్చక్, స్టేన్లి ఈ సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన పత్రాన్ని గుర్తిస్తూ సెనేట్ ప్రెసిడెంట్ నికోలస్ పి. స్కటారి, జనరల్ అసెంబ్లీ స్పీకర్ కైగ్ జె కఫ్లిన్ సంతకాలు చేశారు.
"న్యూజెర్సీ, అమెరికా వ్యాప్తంగా ప్రవాస భారతీయుల విశాల ప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు విశేష కృషి చేస్తున్నారు. భారతదేశంలో విశేష ప్రజాభిమానం పొందిన నేతగా గొప్ప గుర్తింపు పొందిన ఆయన.. సమాజంలో విప్లవాత్మకమైన సానుకూల మార్పులకు కృషి చేస్తున్నారు. 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. ఆ పదవిని అలంకరించక ముందు కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఆ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. ప్రజా జీవితంలో ఎలా మెలగాలో.. మానవాళికి ఎలా సాయపడాలో.. తన చర్యల ద్వారా ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారత్ - అమెరికా మధ్య రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గౌరవిస్తూ ఈ సంయుక్త సభ ఆయన సేవలు గుర్తించడం సబబు" అని ఆ తీర్మానంలో ప్రశంసించారు.
ఈ తీర్మాన పత్రాన్ని అమెరికా ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన తానా 23వ మహాసభల సందర్భంగా న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు స్టేన్లీ.. వెంకయ్యనాయుడుకు అందజేశారు. ఈ తీర్మానం వసుదైక కుటుంబ స్ఫూర్తి, ధర్మం ఆచరించే భారతీయతకు దక్కిన ఓ గౌరవంగా తాను భావిస్తున్నానని వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
- Venkaiah Naidu Latest News : 'దేశ నాగరికత, కళ, సాహిత్య సంపదను భావితరాలకు అందించాలి'
- భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలి : వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Profile: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జులై 1న వెంకయ్యనాయుడు జన్మించారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి వైరాగ్యంతో ఎక్కడికో వెళ్లిపోయినా.. అమ్మమ్మ ఒడిలోనే ఒద్దికగా పెరుగుతూ భవిష్యత్ లక్ష్యాలకు బాటలు వేసుకున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత నెల్లూరులోని వి.ఆర్. కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో బీఏ.. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్ పూర్తి చేశారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా పని చేయడం వల్ల క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం అలవడింది. 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీలో గుర్తింపు పొందిన నాయుకుడిగా.. మంత్రి పదవి పొందారు. అనంతరం భారత 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
ఇవీ చదవండి: