vehicle fell into gorge: ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Uttarakhand Accident 10 dead
ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లికి వీరంతా వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వీరంతా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో తిరిగి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అర్ధరాత్రి తర్వాత 3.20 గంటల సమయంలో వాహనం అదుపు తప్పింది. ఒక్కసారిగా రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
మృతులంతా లక్ష్మణ్ సింగ్ బంధువులేనని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంపావత్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిహారం..
ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని మోదీ నిర్ణయించినట్లు తెలిపింది. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం అందిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13వేల మందికి పాజిటివ్