భారత్‌లో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఎయిడ్) కొత్త మిషన్ డైరెక్టర్‌గా సీనియర్ విదేశాంగ సేవా సభ్యురాలు వీణా రెడ్డి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఆమె దిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు అమెరికా అంబాసిడర్ అతుల్ కశ్యప్.. గురువారం ప్రకటించారు. భారత్, భూటాన్‌లలో మిషన్ డైరెక్టర్‌గా యూఎస్‌ఎయిడ్ కార్యకలాపాలకు వీణా రెడ్డి నేతృత్వం వహించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీణాపై ప్రశంసలు కురిపించారు కశ్యప్. అమెరికాలో అన్ని రంగాల్లో భారతీయ అమెరికన్ల విజయాలను ప్రతిబింబిస్తూ.. మరో భారతీయ అమెరికన్ క్లిష్టమైన మిషన్‌కు నాయకత్వం వహించనున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వీణా రెడ్డి.. భారత్- అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"శాంతియుత, సుసంపన్న సమాజాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం, ప్రజలతో యూఎస్‌ఎయిడ్ గత ఏడేళ్లుగా జత కడుతోంది. అదే సమయంలో ఇరు దేశాల భాగస్వామ్యం అభివృద్ధి చెందింది. మన సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను ఎదురుచూస్తున్నా. ప్రపంచం ఎదుర్కొన్న కొవిడ్‌తో భారత్ ఎక్కువగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా సాగుతామని విశ్వాసం ఉంది."
-వీణా రెడ్డి, యూఎస్‌ఎయిడ్ మిషన్ డైరెక్టర్
తొలి భారతీయ అమెరికన్
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వీణ.. భారత్, భూటాన్ దేశాల్లో యూఎస్ఎయిడ్కు నాయకత్వం వహించే తొలి భారతీయ అమెరికన్ కావడం విశేషం. వీణా రెడ్డి ప్రస్తుతం అమెరికా విదేశీ సేవా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కంబోడియాలో యూఎస్‌ఎయిడ్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైతీలో యూఎస్‌ఎయిడ్ డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా, వాషింగ్టన్ డీసీలో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా, ఆసియా, పశ్చిమాశియాలో యూఎస్‌ఎయిడ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఫెడరల్ ప్రభుత్వ సర్వీసును ప్రారంభించడానికి ముందు వీణ.. న్యూయార్క్, లండన్, లాస్ ఏంజిల్స్‌లో కార్పొరేట్ న్యాయవాదిగా పని చేశారు. ఆమె కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. చికాగో విశ్వవిద్యాలయంలో ఎంఏ, బీఏ పూర్తి చేశారు.
ఇదీ చూడండి: కీలక పదవికి పీకే రాజీనామా- అందుకోసమేనా?