మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత నెలకొనటంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె. టీకా సరిపడా లేదని అన్నారు.
"మహారాష్ట్రలో ప్రస్తుతం 1.5 రోజులకు సరిపడా వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఉన్నాయి. ఆక్సిజన్ నిల్వ సైతం 5-6 రోజులకు మాత్రమే సరిపోతుంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి మేం ఆక్సిజన్‌ను సప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది."
-- రాజేశ్ తోపె, మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
25 టీకా కేంద్రాల్లో ఆగిపోయిన వ్యాక్సినేషన్
మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత ఉన్నందున ముంబయిలో 25 టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయిందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఒక్కరోజుకు మాత్రమే సరిపోతాయని స్పష్టం చేసింది.
'10 రోజులకు సరిపడా వ్యాక్సిన్ అందించండి'
ఒడిశాకు 10 రోజులకు సరిపడా వ్యాక్సిన్ అందిచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. రోజుకు 2.5 లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో తెలిపారు.
" కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒడిశా.. సమర్థవంతంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 2.5 లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నాం. మరో 10 రోజులకు సరిపడా టీకాలను అందించాలని మేము కేంద్రాన్ని కోరుతున్నాం."
-- నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
ఒడిశాలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు మరో రెండు రోజుల్లో ముగుస్తాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి నబా కిషోర్ దాస్ తెలిపారు.
ఆక్సిజన్ అందక..
కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులు ఐదుగురు.. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వారి బంధువులు గురువారం రాత్రి ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి : చురుగ్గా 'అందరికీ టీకా'నే అత్యంత కీలకం