ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకాల కార్యక్రమం నెమ్మదించడానికి తొలినాళ్లలో కొన్ని రాష్ట్రాలు కారణమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, దిల్లీలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు ఆదివారం ఆ మంత్రిత్వ శాఖ ఓ నోట్ జారీచేసింది.
"ఈ రాష్ట్రాలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 5.65 కోట్ల డోసుల టీకా అందుబాటులో ఉన్నప్పటికీ 2.60 కోట్ల డోసులు (46%) మాత్రమే ఉపయోగించాయి. జూన్ 4 నాటికి జాతీయస్థాయిలో సగటున 81% వైద్య సిబ్బందికి టీకా అందించగా, మహారాష్ట్ర (77%), దిల్లీ (73%), పంజాబ్ (65%), తెలంగాణ (64%)లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో టీకా వృథా కూడా అధికంగా ఉంది. పంజాబ్‌లో 1.43 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 1.55 లక్షలు, తెలంగాణలో 2.25 లక్షలు, రాజస్థాన్‌లో 4.76 లక్షలు, కేరళలో 6.33 లక్షల డోసుల టీకా వృథా అయింది. ప్రజల్లో టీకా పనితీరు పట్ల సందేహాలు పెరగడానికి ప్రతిపక్షాలు కారణం అయ్యాయి.
జనవరి 2న భారత ఔషధ నియంత్రణ సంస్థ కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్ పూర్తికాకుండా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. పలువురు ప్రతిపక్ష నాయకులు టీకా, టీకాలు వేసే కార్యక్రమం పట్ల అనుమానాలు వ్యక్తంచేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు తలెత్తాయి. మరోవైపు ప్రతిపక్ష నాయకులే ముందు వరుసలో నిలబడి టీకాలు తీసుకోవడం వారి రెండు నాల్కల ధోరణికి అద్దం పట్టింది. రాష్ట్రాలకు విస్తృత వెసులుబాటు కల్పించిన టీకా విధానం గురించి కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. టీకా సేకరణ, పంపిణీలో రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్‌గాంధీ ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ అంశంపై ఆయన పలు ట్వీట్లు కూడా చేశారు. కొవిన్ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పేర్లు నమోదు చేసుకొని, స్లాట్స్ బుక్ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి రియల్‌టైంలో సమాచారం లభ్యమవుతోంది. సమాచారాన్ని క్రోడీకరించడానికి ప్రభుత్వాలకు, వ్యక్తిగతంగా అధికారులకు ఇది ఎంతో మేలు చేస్తోంది. మహమ్మారి సమయంలో భారత్ అమలుచేస్తున్న వ్యాక్సినేషన్ చరిత్రను డిజిటలీకరించడానికి కొవిన్ ఉపయోగపడుతోంది. భారత్‌లో విజయవంతమైన కొవిన్ యాప్‌ను ఇప్పుడు చాలా ప్రపంచదేశాలు అనుసరించాలని భావిస్తున్నాయి" అని ఆ నోట్‌లో తెలియజేసింది.. అమెరికాలో 299.12 మిలియన్ డోసుల టీకా అందిస్తే, భారత్ ఇప్పటివరకు 230 మిలియన్లు అందించినట్లు వివరించింది.
ఇదీ చూడండి: 'టీకా పంపిణీ విధానమే సరిగా లేదు'