టీకా పంపిణీ(vaccination in india) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తాజాగా.. మంగళవారం కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు(1 crore vaccination in india) పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఐదు రోజుల్లో టీకా పంపిణీ మార్క్ కోటి దాటడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ సందర్భంగా దేశ ప్రజలను అభినందిస్తూ ట్వీట్ చేశారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా.
"ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని టీకా పంపిణీ కార్యక్రమంలో 50కోట్ల ప్రజలు తొలి కరోనా టీకా తీసుకున్నారు. కరోనా యోధుల సేవలు ప్రశంసనీయం."
- మన్సుఖ్ మాండవీయా, కేంద్ర ఆరోగ్యమంత్రి
మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 1.09కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం మీద ఇప్పటివరకు 65కోట్ల (65,12,14,767) టీకాలు అందించినట్టు తెలిపింది.
భారత్లో తొలి 10 కోట్ల మార్కు అందుకోవడానికి 85 రోజుల్లు పట్టింది. 20 కోట్లకు 45 రోజులు, 30 కోట్లకు 29 రోజులు, 40 కోట్లకు 24 రోజులు, 50 కోట్లకు 20 రోజులు, ఆగస్టు 25న 60 కోట్ల మార్కును అందుకునేందుకు కేవలం 19 రోజులే పట్టింది.
కేరళలో తగ్గని ఉద్ధృతి..
కేరళలో కేసులు మంగళవారం భారీగా పెరిగాయి. కొత్తగా 30,203 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 115 మంది మృతి చెందారు. 20,687 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో కొత్తగా 4,196 కేసులు నమోదయ్యాయి. మరో 104 మంది మరణించారు. 4,688 మంది కోలుకున్నారు.
- కర్ణాటకలో కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1,217 కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతిచెందారు.
- మిజోరంలో 1,157 మందికి వైరస్ సోకింది. ప్రతి వెయ్యి మంది జనాభాలో కనీసం 45 మందికి వ్యాధి సోకినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'గుర్తు తెలియని వ్యక్తుల' నుంచే జాతీయ పార్టీలకు ఆదాయం!