కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట. పేర్లు చదవగానే చిన్నతనంలో మీరు ఆడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయా? స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నేహితులతో సరదాగా ఆడుకున్న సంప్రదాయ ఆటలవీ. కానీ, ఈ మిలీనియమ్ పిల్లలకు వీటి గురించి ఏమాత్రం తెలియదు. ఇప్పుడందరూ మొబైల్ ఫోన్, ప్లే స్టేషన్ అంటూ డిజిటల్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. అయితే, తిరిగి ఆ సంప్రదాయ ఆటలకు జీవం పోసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది.
మేరఠ్‌లోని చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ(సీసీఎస్‌యూ)లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో రెగ్యులర్‌గా నేర్పించే వాలీబాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బాస్కెట్‌బాల్‌తోపాటు కర్రాబిళ్ల, గోలీలాట, తొక్కుడు బిళ్ల ఆటలను కూడా చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో భాగంగానే 'ది ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా' పేరుతో ఈ ఆటలను ప్రవేశపెడుతున్నామని యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విధంగానైనా మన సంప్రదాయ ఆటలకు ఒక గుర్తింపు లభిస్తుందని వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేకే పాండే తెలిపారు.
"మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఉనికిని కోల్పోతున్నాయి. తిరిగి వాటిని సమాజంలోకి తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఈ కొత్త కోర్సు నేర్చుకునే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు భవిష్యత్తులో పాఠశాలల్లో పీఈటీలుగా చేరినప్పుడు పిల్లలతో ఈ ఆటలను ఆడించే అవకాశముంటుంది. ఈ ఆటలు కేవలం వినోదాన్నే కాదు.. శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయి"
- కేకే పాండే, వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్.
యూపీలోని లఖ్‌నవూ యూనివర్సిటీ కూడా గతేడాది విభిన్న కోర్సును ప్రవేశపెట్టింది. ఎం.ఎడ్ కోర్సులో 'ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యాపీనెస్' పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ పాఠ్యాంశం ద్వారా అసలైన ఆనందం అంటే ఏంటి? అనే విషయాన్ని బోధిస్తున్నారు.
ఇదీ చూడండి: TAJ MAHAL: ప్రేమ సౌధంలో మళ్లీ సందడి షురూ