doctor killed his family in kanpur: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన సుశీల్ కుమార్ అనే వైద్యుడు.. భార్యాపిల్లల్ని హతమార్చాడు. 'మహమ్మారి వల్ల కలిగే సవాళ్ల నుంచి విడిపించడం సహా.. వారి కష్టాలన్నింటినీ క్షణాల్లో తొలగించేందుకే ఇలా చేశాను' అని ఆయన రాసిపెట్టడం గమనార్హం. నగరంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆ వైద్యుడు కల్యాణ్‌పుర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ హత్యల వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. ఓ లేఖను విడుదల చేశాడు. తాను నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
బయటపడిందిలా..
kanpur man kills his family: కుటుంబ సభ్యుల జంట హత్యలకు పాల్పడిన సుశీల్.. వీటి గురించి పోలీసులకు తెలియజేయాలని కోరుతూ.. తన సోదరుడు సునీల్‌కు ఫోన్లో ఓ సందేశం పంపాడు. దీనితో వెంటనే అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. సెక్యూరిటీ గార్డుల సహాయంతో తాళం పగలగొట్టి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన పోలీసులు నిశ్చేష్టులయ్యారు. కుటుంబ పెద్ద చేతిలో బలైనవారిలో చంద్రప్రభ (48), శిఖర్ సింగ్ (18), మరో కుమార్తె ఖుషీ సింగ్ మృతదేహాలు వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు.
వీరిలో చంద్రప్రభను సుత్తితో హత్య చేయగా, శిఖర్, ఖుషీని గొంతు నులిమి హత్య చేశాడు. అంతకుముందు.. వీరందరికీ టీలో మత్తు మందు ఇచ్చాడని.. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత హత్య చేశాడని పోలీసు కమిషనర్ తెలిపారు.
"నేను చాలా డిప్రెషన్‌కు గురయ్యా. ఈ సమయంలో నా కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేయలేను. అందుకే కుటుంబం మొత్తానికి విముక్తి కల్పించా. ఒక్క క్షణంలో వారి కష్టాలన్నింటినీ తొలగిస్తున్నా. కరోనా ఎవరినీ అంత సులువుగా విడిచిపెట్టదు. నయంకాని వ్యాధితో బాధపడుతున్న నాకు.. భవిష్యత్తు శూన్యంగా మారింది."
-సోదరునికి పంపిన సందేశంలో సుశీల్
మరోవైపు.. జంట హత్యలకు పాల్పడిన సుశీల్‌ను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.
ఇవీ చదవండి: