ఉత్తరాఖండ్ తొలి అంతర్జాతీయ పారా షూటర్ దిల్రాజ్ కౌర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో.. డబ్బు సంపాదించేందుకు వేరే మార్గం లేక.. రోడ్డు పక్కనే ఓ దుకాణం ఏర్పాటు చేసి సరుకులు అమ్ముతున్నారు. దెహ్రాదూన్ గాంధీ పార్క్ వద్ద చిప్స్ అమ్ముతూ వార్తల్లో నిలిచారు.
ఒక్కరిదే కాదు..
ఈ సమస్య ఒక్క ప్లేయర్ది మాత్రమే కాదని, రాష్ట్రంలో చాలా మంది ఆటగాళ్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి గణేష్ జోషి కుమార్తె నేహా జోషి అన్నారు. దిల్రాజ్కౌర్ ను కలిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ పాలసీ వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
"రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్లేయర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఆటగాళ్ల బాగోగుల కోసం అన్ని ఏర్పాట్లు సకాలంలో జరుగుతుంటాయి. ఓ ప్లేయర్.. దేశం కోసం ఆడినప్పుడు అందరూ గర్వంగా భావిస్తారు. కానీ, కొన్ని రోజులు ముగిశాక ఓ ఆటగాడిని ఎవ్వరూ గుర్తించుకోని పరిస్థితి ఏర్పడుతోంది."
--దిల్రాజ్ కౌర్, షూటర్.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఆటగాళ్లందరికీ సాయం చేయాలని, వారిని ఆదుకోవాలని దిల్రాజ్ కౌర్ డిమాండ్ చేశారు.
దిల్రాజ్ ఇప్పటివరకు 24 బంగారు పతకాలు, 8 వెండి, 3 కాంస్య పతకాలు గెలిచారు. ఉత్తరాఖండ్ స్టేట్ షూటింగ్ పోటీల్లో నాలుగు సార్లు బంగారు పతకం గెలిచినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఓ వెండి పతకం సాధించారు.
ఈ నేపథ్యంలో ఆమెను త్వరలోనే కలవనున్నట్లు క్రీడా శాఖ మంత్రి అర్వింద్ పాండే తెలిపారు.
ఇదీ చదవండి:'గోల్డెన్ బాబా' బంగారు మాస్క్- ధరెంతంటే..?