రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రమాదకరంగా కారులో చిక్కుకుపోయిన పంత్‌ను కాపాడిన డ్రైవర్, కండక్టర్‌ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా ప్రకటించారు. "రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన డ్రైవర్, హరియాణా రోడ్‌వేస్ ఆపరేటర్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం జనవరి 26న సన్మానిస్తుంది. వీరిద్దరూ పంత్‌ను కాపాడటానికి తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకొన్నారు. వీరి కళ్ల ఎదుటే క్రికెటర్ కారు చాలా పల్టీలు కొట్టింది. వీరు తక్షణం అక్కడకు చేరుకొని అవసరమైన సాయం చేశారు" అని ఓ ఆంగ్ల వార్తాసంస్థతో ధామి పేర్కొన్నారు.
డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున భారత క్రికెటర్ రిషభ్ పంత్ దిల్లీ నుంచి కారులో రూర్కీకి వెళ్తుండగా నార్సన్ సరిహద్దుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న హరియాణా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్‌జీత్ వెంటనే కారు వద్దకు వెళ్లి పంత్‌ను దాని నుంచి బయటకు తీసుకొచ్చారు. అతడు బయటపడిన 5-7 సెకన్లలోపే కారు మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. ఈ సాహసం చేరి వారిద్దరినీ హరియాణ ప్రభుత్వం అభినందించింది.
తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే రోజున వారిని సత్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ రోడ్డు ప్రమాదంపై హరిద్వార్ రూరల్ ఎస్పీ ఎస్‌కె సింగ్ మాట్లాడుతూ.. "ప్రమాదం జరిగిన నార్సాన్ ప్రాంతానికి కిలోమీటరు ముందు పంత్ నిద్రమత్తులోకి జారుకున్నాడు" అని పేర్కొన్నారు.
పంత్‌ను పరామర్శించడానికి దయచేసి వెళ్లొద్దు!
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని.. అతడికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయని దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ సూచించారు. "అక్కడికి వీఐపీలు ఎవరూ రాకూడదు. పంత్‌కు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉండడం వల్ల ఆ పరిస్థితి నివారించేందుకు అక్కడకు వెళ్లవద్దు. అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. జైషా పర్యవేక్షిస్తున్నారు. రోడ్డుపై గుంతను తప్పించే యత్నంలో కారు ప్రమాదానికి గురైనట్లు పంత్ చెప్పాడు" అని శర్మ వివరించారు. పంత్ వైద్య చికిత్సను పర్యవేక్షించేందుకు డీడీసీఏ బృందం ఒకటి దెహ్రాదూన్ వెళుతుందని చెప్పారు.