Uttarakhand Election myths: ఉత్తరాఖండ్లో ఐదేళ్లకోసారి పార్టీ మారిపోయే సంప్రదాయానికి భాజపా చెక్ పెట్టింది. వరుసగా రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యే సంప్రదాయం మాత్రం మారలేదు. ప్రస్తుతం సీఎం పీఠంపై కూర్చున్న భాజపా నేత పుష్కర్ సింగ్ ధామీ.. తన నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఖాటిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత భువన్ చంద్ర కాప్రి చేతిలో పరాజయం పాలయ్యారు.
Uttarakhand CM losing myth
రెండు దఫాలుగా ఖాటిమా నియోజకవర్గం నుంచి ధామీ గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు ఆయనకు మొండిచెయ్యి చూపించారు. ధామీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లిన భాజపా రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే, సీఎం తన సొంత సీటునే కాపాడుకోలేకపోయారు.
ఇలా సీఎంలు ఓడిపోవడం ఉత్తరాఖండ్లో ఆనవాయితీగా వస్తోంది. 2017 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సైతం ఓటమిపాలయ్యారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో చతికిలపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి, విశ్రాంత మేజర్ జనరల్ భువనచంద్ర ఖండూరీ సైతం ఇలాగే ఓడిపోయారు.
మాజీ సీఎం హరీశ్ రావత్ ప్రస్తుత ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. లాల్కువా నుంచి పోటీ చేసిన ఆయన.. భాజపా నేత డాక్టర్ మోహన్ సింగ్ బిస్త్ చేతిలో సుమారు 14 వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ చరిత్ర ఇలా...
సంవత్సరం- గెలిచిన పార్టీ
- 2002- కాంగ్రెస్ (రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు)
- 2007- భాజపా
- 2012- కాంగ్రెస్
- 2017- భాజపా
- 2022-భాజపా
విద్యా శాఖ మంత్రులు
ముఖ్యమంత్రులు ఓడిపోవడమే కాకుండా.. విద్యా శాఖ మంత్రులు సైతం ఇలాగే ఓడిపోతారనే సెంటిమెంట్ కూడా ఉంది. 2002 ఎన్నికల నుంచి విద్యా శాఖ మంత్రులు ఓడిపోతున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో ఈ పరంపరకు చెక్ పెట్టారు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి అర్వింద్ పాండే. గదర్పుర్ స్థానం నుంచి విజయం సాధించారు.
గంగోత్రి సెంటిమెంట్
Uttarakhand Gangotri sentiment: ఇవేగాక, గంగోత్రిలో ఎవరు గెలిస్తే వారిదే అధికారం అనే భావన కూడా రాష్ట్రంలో ఉంది. ఎన్నికల్లో మెజార్టీ సాధించిన పార్టీ సభ్యులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సురేశ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. ఆయన గెలిస్తే.. ఈ సెంటిమెంట్ కొనసాగినట్లు అవుతుంది.
ఫలితాలపై ప్రత్యేక కథనాలు: