తాగునీటి కొరత ఉందని తెలిసి ఆయన అందరిలా ఊరుకోలేదు. కరోనా కారణంగా విధించిన రెండు లాక్డౌన్లను వినియోగించుకుని నీటి సమస్యకు పరిష్కారం చూపాడు. వయసును సైతం లెక్కచేయకుండా ఒంటరిగా బావిని తవ్వేశాడు కర్ణాటకలోని ఉత్తర కన్నడ వాసి.

8 నెలల కృషితో..
అంకోలా తాలూకు మంజగుని గ్రామానికి చెందిన మహదేవ మంకాలు నాయక్.. తన గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాడు. కరోనా మొదటి దశలో విధించిన లాక్డౌన్ సమయంలో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా బావిని తవ్వడం మొదలుపెట్టాడు. 8 నెలల పాటు కృషి చేసి 32 అడుగుల బావిని తవ్వాడు. కానీ, అందులో ఆశించినన్ని నీళ్లు రాకపోవడం వల్ల నిరాశ చెందాడు. ఈ క్రమంలో లాక్డౌన్ సడలింపుల వల్ల తిరిగి తన పనులకు వెళ్లడం ప్రారంభించాడు.


కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ రూపంలో ఆయనకు మరో అవకాశం వచ్చింది. ఈ క్రమంలో బావిని మరో 4 అడుగుల లోతు తవ్వాడు మహదేవ. అంతే.. బావిలో ఆశించిన స్థాయిలో నీళ్లు వచ్చాయి.
"ఎండాకాలం రాగానే గ్రామంలో తాగునీటి సమస్య పెరుగుతోంది. వారానికి ఓసారి వచ్చే ట్యాంకర్ల కోసం గ్రామస్థులు వేచి చూడాల్సి వస్తోంది. చాలా మంది ఇళ్లల్లో బావులు ఉన్నప్పటికీ అందులో నీరు ఉండటం లేదు. అందుకే.. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు బావిని తవ్వాను."
--మహదేవ మంకాలు నాయక్.
మహదేవ సంకల్పానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి:రైతు అవతారంలో మాజీ సీఎం- ట్రాక్టర్‌పై సవారీ