ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ జిల్లాలోని సంఘీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జూహీ శుక్లాపుర్లో నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ఆలయ నిర్మాణంపై దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రజలు మూఢనమ్మకాల్లో చిక్కుకోకూడదని ఇలా చేసినట్లు ఐజీ కేపీ సింగ్ తెలిపారు.
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసు బృందాలు కృషి చేస్తున్నాయని అన్నారు కేపీ సింగ్. ఇది ఓ ప్రమాదకరమైన వైరస్ అని చెప్పిన ఆయన.. ప్రజలు ఇలాంటి ముఢనమ్మకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సోదరుని ఫిర్యాదుతో...
కరోనా మాత ఆలయాన్ని నిర్మించిన లోకేశ్ కుమార్‌పై అతని సోదరుడు నగేశ్‌కుమార్ శ్రీవాత్సవ ఫిర్యాదు చేసినట్లు ఐజీ కేపీ సింగ్ తెలిపారు. లోకేశ్ ఆలయ నిర్మాణం చేసేటప్పుడు ఇతర కుటుంబ సభ్యులు ఎవరినీ సంప్రదించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. నిర్మాణం పూర్తి అయిన తరువాత తాను నివసిస్తున్న ఘజియాబాద్‌కు తిరిగి వెళ్లినట్లు ఐజీ చెప్పారు.
విముక్తి కలిగిస్తుందని..
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌ను నివారించడానికి దేవతగా భావించి పూజిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
"ఈ వైరస్‌ను నయం చేసే శక్తి కరోనా మాతకు ఉందని మేము నమ్ముతున్నాము. గతంలో ఇలానే మశూచి వచ్చినప్పుడు మశూచి తల్లి నయం చేసిందని విన్నాము. అలానే కరోనా మాత ఈ కష్టాల నుంచి బయట పడేస్తుందని ఆలయాన్ని ఏర్పాటు చేశాము. ఇందుకు గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించాం. దేశంలో ఇలాంటి ఆలయాలు ఏర్పాటు చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇలానే పూజించారు. అయితే విగ్రహాన్ని తాకేందుకు భక్తులకు అనుమతి లేదు."
- రాధే శ్యామ్, ఆలయ పూజారి
ఇదీ చూడండి: 'కరోనా మాతా.. నువ్వే రక్షించాలమ్మా'