పెళ్లిలో పత్రికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వెడ్డింగ్ కార్డ్స్‌పై ఎవరైనా దేవుడి చిత్రాలను ముద్రిస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో మేరఠ్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ భిన్నంగా ఆలోచించారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రికలపై అభిమాన నాయకుల ఫొటోలను ముద్రించారు. వారిని దేవుడితో సమానంగా భావిస్తానని అంటున్నారు.
రాజ్‌పుర గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ వృత్తి రీత్యా ఓ వ్యాపారి. కుమారుడి వివాహం సందర్భంగా.. సమాజ్‌వాదీ పార్టీ, ఇష్టమైన నాయకులపై అభిమానాన్ని చాటాలనుకున్నారు. ఇందుకు పెళ్లి పత్రికలను తన అభిరుచికి తగ్గట్లుగా తయారు చేయించారు శ్రవణ్. వెడ్డింగ్ కార్డ్స్‌పై దేవుడి చిత్రాలు ముద్రించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, అఖిలేశ్ యాదవ్, మాజీ మంత్రి షాహిద్ మంజూర్ ఫొటోలను ఉంచి తయారు చేయించారు. ఆహ్వాన పత్రికల రంగును సైతం సమాజ్‌వాదీ పార్టీ జెండాను ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. పార్టీ గుర్తు ప్రత్యేకంగా కనిపించేలా పత్రికను రూపొందించారు.
"చరణ్ సింగ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన నిరాడంబరంగా జీవించారు. అఖిలేశ్, షాహిద్ మంజూర్ అంటే నాకు చాలా అభిమానం. పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుకే ఈ ముగ్గురి ఫొటోలను వెడ్డింగ్ కార్డ్స్‌పై ఉంచి తయారు చేయించాను."
- శ్రవణ్ కుమార్
దీనిపై స్పందించిన షాహీద్ మంజూర్.. శ్రవణ్‌కు ఎస్పీతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. అఖిలేశ్ యాదవ్‌కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు.
అయితే.. పెళ్లి పత్రికలను ఇలా తయారు చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రచారం ఇలా కూడా చెయ్యొచ్చని అంటున్నారు.
ఇదీ చదవండి:పేదలకు ఉచితంగా ఖరీదైన పెళ్లి వస్త్రాలు.. ఎక్కడంటే?