గంగానదిలో.. ఓ చెక్క డబ్బాలో తేలుతూ కనిపించిన 21రోజుల పసికందును కాపాడిన వ్యక్తిని ప్రశంసించింది ఉత్తర్ప్రదేశ్ సర్కారు. బోటు నిర్వాహకుడు గుల్లు చౌదరికి.. కొత్త బోటు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హత ప్రకారం ఇతర పథకాల ద్వారా కూడా ఆయనకు లబ్ధి చేకూర్చనున్నట్లు ప్రకటించింది.
చిన్నారి బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు గాజీపుర్ జిల్లా అధికారులు దాద్రీ ఘాట్ సమీపంలోని గుల్లు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే.. చిన్నారికి కాపాడిన గుల్లు చౌదరికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ.. సొంతంగా బోటు లేదని స్పష్టం చేశారు. తన ఇంటి వరకూ సిమెంట్ రోడ్డు వేయించాలని గుల్లు అధికారులను కోరినట్లు తెలిపారు.
ఇదీ జరిగింది..
అభం శుభం తెలియని ఓ పసికందును డబ్బాలో పెట్టి గంగా నదిలో వదిలారు ఆమె తల్లిదండ్రులు. చిన్నారి జాతకం సహా పలు వివరాలు ఓ కాగితంపై రాసి చెక్క డబ్బాలో వదిలేశారు. చివరకు ఆ చిన్నారి ఓ బోటు యజమానికి దొరికింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ గాజీపుర్లో జరిగింది.
ఇదీ చదవండి:చిన్నారికి హోంవర్క్ కష్టాలు- గవర్నర్ కీలక ఆదేశాలు